పోటాపోటీ సమావేశాలు..

17 Apr, 2018 08:19 IST|Sakshi
కార్పొరేటర్లతో సమావేశంలో మేయర్‌ శ్రీధర్‌

ఎమ్మెల్యేలకు దీటుగా మేయర్‌

ఆధ్వర్యంలో నగరాభివృద్ధిపై మీటింగ్‌

హాజరైన కార్పొరేటర్లు

కమిషనర్‌పై శ్రీధర్‌ ఆగ్రహం

పటమట (విజయవాడ తూర్పు) : విజయవాడ నగరపాలక సంస్థలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది. నగరంలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కమిషనర్‌తో నిర్వహించిన సమావేశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేలకు దీటుగా మేయర్‌ శ్రీధర్‌ వీఎంసీలోని తన చాంబర్‌లో సోమవారం నగరాభివృద్ధిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కమిషనర్‌పై సీరియస్‌..
ఇటీవల బీపీఎస్‌ (బిల్డింగ్‌ ప్లీనరైజేషన్‌ స్కీం) ద్వారా నగరపాలక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యేలు వాటిలో ఒక్కో నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేటాయించాలంటూ వచ్చిన ప్రతిపాదనపై మేయర్‌ సీరియస్‌ అయ్యారు. కమిషనర్‌పై ఆయన భగ్గుమన్నారు. నగరపాలక సంస్థకు చెందిన సొమ్మును ఎమ్మెల్యేలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయింపులు చేసుకోవాలని సూచించారు.

బీపీఎస్‌ ఆదాయం విభజన..
కాగా, బీపీఎస్‌ ద్వారా వచ్చిన సొమ్మును మేయర్‌ విభజించారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు పలు పనులకు సంబంధించి చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో వారు సమ్మెకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో తక్షణమే సమస్యను కొంత వరకు పరిష్కరించేందుకు బీపీఎస్‌ ఆదాయం నుంచి రూ.20 కోట్లు కేటాయించి వారికి చెల్లింపులు చేయాలని కమిషనర్‌ను మేయర్‌ ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కార్పొరేషన్‌ నూతన భవనానికి రూ.10 కోట్లు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కార్పొరేటర్లకు వారి అర్జీల ద్వారా వచ్చిన పనులు చేపట్టేందుకు రూ.10 కోట్లు కేటాయించాలని, మిగిలిన సొమ్మును జేఎన్‌యూఆర్‌ఎం పనులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను మేయర్‌ ఆదేశించారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ హరిబాబు, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావు, ఉమ్మడిశెట్టి బహదూర్, వీరమాచనేని లలిత, కో–ఆప్షన్‌ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా