రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!

16 Aug, 2019 10:25 IST|Sakshi

 ఒక్క రోజులో రూ. 53 వేలు వసూలు

పార్టీ నిధుల కోసం వైగో వినూత్న యత్నం

సాక్షి, చెన్నై: రూ. వంద చేతిలో పెడితే గానీ, సెల్ఫీ దిగేందుకు ఎండీఎంకే నేత, ఎంపీ వైగో అనుమతించడం లేదు. పార్టీ కార్యకర్త, నాయకుడు ఎవరైనా సరే రూ.వంద చెల్లించి ఫోటో దిగాల్సిన పరిస్థితి. ఇవ్వకుంటే, కరాఖండిగా ఫొటో దిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పేస్తున్నారు. ఆ దిశగా గురువారం ఒక్క రోజు వైగోకు ఈ సెల్ఫీ, ఫోటోల రూపంలో రూ.53 వేలు దక్కడం గమనార్హం. 

రాజ్యసభ సభ్యుడు ఎండీఎంకే నేత వైగో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తనను రాజ్య సభకు పంపించారని, అందుకు తగ్గట్టుగా తన పయనం ఉంటుందని ఇప్పటికే వైగో ప్రకటించారు. ఆ దిశగా రాజ్యసభలో వైగో ప్రసంగాలు హోరెత్తాయి. అదే సమయంలో ప్రస్తుతం ఎంపీగా మారిన వైగో తన పార్టీకి ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో ఎండీఎంకేకు భారీగానే నిధులు దక్కినా, కాల క్రమేనా కష్టాలు తప్పలేదు. ముఖ్య నాయకులు పార్టీ వీడడంతో ఖర్చు పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నిధులను సమకూర్చుకునేందుకు కొత్త బాట వేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం ద్వారా గత వారం ఓ ప్రకటన విడుదల చేయించారు. ఇక, మీదట వైగోకు కప్పే శాలువలు, వేసే పూల మాలలు, పుష్పగుచ్ఛాల ఖర్చుకు అయ్యే మొత్తాన్ని పార్టీకి సమర్పించాలని సూచించారు. అలాగే, ఇక మీదట వైగోతో సెల్పీ గానీ, ఫోటోగానీ దిగాలన్నా రూ. వంద చెల్లించాల్సిందేనని ప్రకటించారు. ఈ రకంగా వంద కోట్టు.. ఫొటో పట్టు అంటూ వైగో ముందుకు సాగే పనిలో పడ్డారు.

ఒక్క రోజులో రూ. 53 వేలు...
గురువారం చెన్నై నుంచి కృష్ణగిరికి వైగో పయనం అయ్యారు. తన పయన మార్గంలో పలు చోట్ల కారు దిగి, కేడర్‌ను, స్థానికంగా ఉన్న నాయకుల్ని కలిసి వెళ్లారు. వైగో రాకతో ఎండీఎంకే వర్గాలు ఉరకలు తీశాయి. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే, ముందు రూ.100 చేతిలో పెట్టాలని, ఆ తర్వాతే సెల్ఫీ, ఫొటో అని వైగో తేల్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు తమ అధినేతకు రూ.వంద ఇచ్చి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున రాగా వంద ఇస్తేనే అంటూ వైగో తేల్చడంతో వారు వెనుదిరగక తప్పలేదు. వంద ఇవ్వకుంటే, సెల్ఫీ లేదంటూ వైగో అనుమతి నిరాకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం గమనార్హం. ఇక, ఈ ఒక్క రోజు చెన్నై నుంచి కృష్ణగిరి వరకు సాగిన పయనంలో వైగోకు రూ. 53 వేలు లభించినట్టు, దీనిని పార్టీ నిధికి ఆయన అప్పగించినట్టుగా ఎండీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. 
 

>
మరిన్ని వార్తలు