కాకినాడలో టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల భేటీ

21 Jun, 2019 04:38 IST|Sakshi
గురువారం కాకినాడలో సమావేశమైన కాపు నేతలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  జగన్‌ ప్రభంజనం ముందు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీలో తీవ్ర నిస్తేజం అలుముకుంది. ఫ్యాన్‌ గాలికి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో  టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. ఆ విషయమై పార్టీలో తర్జన భర్జనలు పడుతుండగానే..గంటల వ్యవధిలోనే ఆ పార్టీ తరఫున  పోటీ చేసి ఓడిపోయిన 13 మంది కీలక నేతలతో సహా పలువురు కాకినాడలోని సిటీ ఇన్‌ హోటల్‌లో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఓసారి గమనిస్తే.. తమ పార్టీ అధికారంలో ఉండగా చేసిన తప్పులు ఎక్కడ చుట్టుకుంటాయోనని ఆత్మరక్షణలో పడిన నేతలు..రక్షణ ఇచ్చే షెల్టర్‌ వెతుక్కునే పనిలో పడ్డారు.

అందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు గురువారం హుటాహుటిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. నాడు తెలంగాణలో రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించినట్టే.. నేడు కేసుల నుంచి కాపాడుకోవడానికి తమ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారన్న వాదనలున్నాయి. తనకు సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు, బినామీలను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపించిన చంద్రబాబు ఆ విషయాన్ని తమకు చెప్పకుండా రహస్యంగా దాచి ఉంచడమేమిటని ఆ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తామంతా ఐకమత్యంగా ఉండి, భవిష్యత్తులో ఓ నిర్ణయం తీసుకోవాలన్న అజెండాతోనే కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం.

పార్టీ మారేదిలేదంటున్న నేతలు..
కాకినాడలోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన సమావేశంలో  కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో సహా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు పాల్గొన్నారు.  సుమారు మూడు గంటలపాటు సమాలోచనలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు మాత్రమే సమావేశమయ్యామని, పార్టీ మారే ప్రసక్తే లేదంటూ ఉద్ఘాటించారు. తాము ఇప్పుడు పార్టీ మారి ఐదేళ్లు వేరొక పార్టీని ఎందుకు మోయాలని, తాము పార్టీలోనే ఉంటూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వివరించారు. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు బీజేపీకి వెళ్లిపోతున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీలో ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్న తమకు చాలా తేడాలున్నాయని, వారికి ఏవేవో వ్యాపార లావాదేవీలు ఉండడంతో అవసరాల దృష్ట్యా  అలా చేసి ఉండొచ్చని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, పంచకర్ల రమేష్‌బాబు, ఈలి నాని, చెంగలరాయుడు, బండారు మాధవనాయుడు,  కదిరి బాబూరావు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు