మెగా బ్రదర్స్‌కు పరాభవం

25 May, 2019 13:33 IST|Sakshi

ఆదరించని పశ్చిమ ప్రజలు పాలకొల్లులో

గతంలో చిరంజీవి ఓటమి

భీమవరంలో పవన్‌కల్యాణ్‌కు దక్కని గెలుపు

నరసాపురం ఎంపీగా పోటీచేసి మూడో స్థానానికి పరిమితమైన నాగబాబు

మాదీ పశ్చిమగోదావరే...మా నాన్న జిల్లాలో పనిచేశారు.మొగల్తూరు మా సొంతూరు అంటూ ఎన్నికల్లో పోటీచేసిన మెగా బ్రదర్స్‌కు డెల్టాప్రాంత ఓటర్లు పెద్ద షాక్‌ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం గురించి పట్టించుకోని కొణిదెల చిరంజీవి (ప్రజారాజ్యం పార్టీ స్థాపకులు), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, మెగా సోదరుడు నాగబాబుకు చేదు పరిస్థితులే ఎదురయ్యాయి.

భీమవరం: మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయడం అవివేకమని నీతివంతమైన పాలన అందించడానికి డబ్బుతో కాకుండా నిజాయితీతో రాజకీయాలు చేయాలంటూ చిరంజీవి ఎన్నో ప్రసంగాలు చేశారు. అయితే 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తన భార్య సురేఖ పుట్టిన ఊరైన పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గెలుపు సునాయాసమని అక్కడి నుంచి పోటీకీ దిగారు. నీతివంతమైన పాలన అంటూనే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసే విధంగా సొమ్ములు పంపిణీ చేశారు. అయినప్పటికీ అక్కడ మైనార్టీ (వైశ్య) వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోర పరాజయం పొందారు. పాలకొల్లు ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ తేజ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.

ఎంతచేసినా చిరంజీవికి ఓటర్ల నుంచి ఆదరణ దక్కలేదు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో మెగా తమ్ముడు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ తరపున భీమవరం నుంచి అసెంబ్లీకి,  మెగా సోదరుడు నాగబాబు నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి వివిధ సామాజిక వర్గాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, కులవృత్తుల వారితో సమావేశాలు నిర్వహించడమేగాక మెగా సోదరులతోపాటు నాగబాబు భార్య పద్మజ, కుమారై నిహారిక, కొడుకు వరుణ్‌తేజ్‌తో సహా జబర్దస్త్‌ టీమ్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో నాగబాబు మాది మొగల్తూరు ఇక్కడి సమస్యలు మాకు బాగా తెలుసు ప్రజల కష్టాలను తీరుస్తామంటూ ఊదరగొట్టారు. పెనుగొండలో బంధువులున్నారు. మొగల్తూరులో మాకు ఇల్లు ఉండేది, మాఅన్న చిరంజీవి నరసాపురం వైఎన్‌ కళాశాలలోనే చదువుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రాంతీ యతను రాజేచి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

ఓటర్లకు డబ్బు పంపిణీకి తాము వ్యతి రేకమంటూనే భీమవరం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు పెద్ద ఎత్తున సొమ్ములు పంపిణీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొనుగోలు నుంచే డబ్బు పంపిణీ ప్రారంభించారు. మెగా బ్రదర్స్‌పై సినిమా అభిమానంలో అన్ని వర్గాల ప్రజలు పవన్‌కల్యాణ్‌ సభలకు ఎటువంటి తరలింపులు లేకుండానే పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో పవన్‌కల్యాణ్‌ భీమవరం ఎమ్మెల్యేగా, నాగబాబు నరసాపురం ఎంపీగా గెలుపు ఖాయమంటూ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు పందేలు కూడా కాశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా అప్పులు చేసి పవన్‌కల్యాణ్, నాగబాబు విజయం సాధిస్తారంటూ పెద్ద మొత్తంలో పందేలు వేశారు.  గురువారం వెల్లడైన ఫలితాల్లో పవన్‌కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ చేతిలో 8,691 ఓట్ల తేడాతో ఓడిపోగా.. నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగబాబు మూడవ స్థానానికే పరిమితమయ్యారు. దీనితో పశ్చిమలో మెగా బ్రదర్స్‌కు ఆదరణలేదని ఓటర్లు తేటతెల్లం చేసినట్లు స్పష్టమైంది.

మరిన్ని వార్తలు