ఫిరాయింపులు కూడా మోదీ ఘనతేనా?

2 Jan, 2018 10:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వరుసగా ఒక్కో రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ అధికారం కైవసం చేసుకుంటున్న బీజేపీ మిగతావాటిపై కూడా దృష్టిసారించింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న మేఘాలయాలో ఎన్నికల ముందుగానే ఒక్కసారిగా రాజకీయంగా అలజడి చెలరేగింది. అసంతృప్త అధికారపక్ష నేతలు ఒక్కోక్కరిగా ఎన్టీఏ మిత్ర పక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ)లో చేరిపోతున్నారు. అయితే ఈ ఫిరాయింపులను కూడా మోదీ పుణ్యమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటుండటం విశేషం. 

బీజేపీ జాతీయ ప్రతినిధి రామ్‌ మాధవ్‌ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. మేఘాలయ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం. ఆయన పిలుపు మేరకే అభివృద్ధి కోసం వారంతా పార్టీ మారుతున్నారు అంటూ మాధవ్‌ పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామిక వ్యతిరేక ఫిరాయింపులను కూడా గర్వంగా ప్రధాని కట్టబెడుతున్న మాధవ్‌ మేధస్సుకు హ్యాట్సాఫ్‌ అంటూ పలువురు ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. 

కాగా, మేఘాలయాలో ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండటం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రొవెల్ల్‌ లింగ్దోతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఎన్‌పీపీలో చేరిపోయారు. మరో ముగ్గురు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎన్‌పీపీలో చేరిపోగా.. ఇప్పుడు మరో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉ‍న్న మేఘాలయ అసెంబ్లీలో.. ప్రస్తుతం సీఎం ముకుల్‌ సంగ్మా తరపున 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు.  ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు