మేఘాలయలో హంగ్‌

4 Mar, 2018 01:53 IST|Sakshi
విజయసంకేతం చూపిస్తున్న సంగ్మా దంపతులు

అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌

బీజేపీ రెండు స్థానాలకే పరిమితం

21 స్థానాల్లో కాంగ్రెస్, 19 చోట్ల ఎన్పీపీ విజయం

చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుపైనే అందరి దృష్టి

షిల్లాంగ్‌: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. 59 స్థానాలకుగాను అధికార కాంగ్రెస్‌ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ  రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మేఘాలయ అసెంబ్లీలోని 60కి గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బాంబు పేలుడులో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేయగా.. అటు ఎన్‌పీపీ, బీజేపీలు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నాయి.  

ప్రాంతీయ పార్టీలే కీలకం
ఈ ఎన్నికల్లో యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) నాలుగు, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(హెచ్‌ఎస్‌పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్‌ఎన్‌ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.   

సంకీర్ణం ఏర్పాటుకు ప్రయత్నాలు
ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పీఏ సంగ్మా కుమారుడు కొనార్డ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు మణిపూర్‌లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. కొనార్డ్‌ మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉన్నాం. అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోసం ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై మాత్రం స్పందించలేదు. బీజేపీ.. చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చించేందుకు హిమంత శర్మను మేఘాలయకు పంపింది.

గోవా, మణిపూర్‌ అనుభవంతో కాంగ్రెస్‌ అప్రమత్తం
ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఇతర పార్టీలతో పొత్తు చర్చల కోసం సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్, కమల్‌ నాథ్‌లను కాంగ్రెస్‌ మేఘాలయకు పంపింది. గతేడాది గోవా, మణిపూర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో నిర్లిప్తంగా ఉంది. దీంతో మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. ‘మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ద్వారా ప్రజల అభిమతం నెరవేరనుంది. మేం ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నాం. ధనబలంతో  వీలైనంత గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు