‘ఒమర్‌..బాదం తిని మెమరీ పెంచుకో’

18 Apr, 2019 15:25 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో రాజకీయ వారసులు ఒమర్‌ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీ మరోసారి ట్వీట్‌ వార్‌కు దిగారు.  ఈసారి మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రజ్ఞ బీజేపీలో చేరడం వారి ట్వీట్‌ దాడికి కేంద్ర బిందువైంది. బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞను బీజేపీ భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై పోటీగా బరిలోకి దింపింది. బీజేపీలో ప్రజ్ఞ చేరికపై పీడీఎఫ్‌ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను ఉగ్రవాద నిందితుడిని పోటీలో నిలిపితే ఎలాంటి ఆగ్రహం పెల్లుబుకుతుందో ఊహించండి..మీడియా ఛానెల్స్‌ విపరీత ధోరణితో ప్రచారం చేసేవని ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పే వీరే ముస్లింలంతా ఉగ్రవాదులేనని చెబుతారని, నిర్ధోషిగా నిరూపించుకునేవరకూ ముద్దాయిలేనని మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మెహబూబా ట్వీట్‌కు స్పందించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్ధుల్లా ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు. ఇదే బీజేపీ మిమ్మల్ని అధికారం నుంచి తప్పించేవరకూ మీ మిత్ర పక్షంగా ఉన్నారని, 2014లో అధికారంలోకి రాకముందే బీజేపీ తీరు ఇలాగే ఉన్నా జూన్‌ 2018 తర్వాతే వారి పాపాలను మీరు గుర్తించారని, అధికార దాహంతో మీకు వారి పాపాలు కనిపించలేదని దుయ్యబట్టారు.

ఒమర్‌ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మెహబూబా ముఫ్తీ మరో ట్వీట్‌లో.. అటల్‌ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ హిందుత్వ రాజకీయాల గురించి ఒమర్‌ అబ్ధుల్లాకు ఏమీ తెలియదని సెటైర్లు వేశారు. గోద్రా ఘటనల అనంతరం బీజేపీతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అంటకాగిన విషయం గుర్తులేదా అంటూ ఒమర్‌కు చురకలు వేశారు. ఒమర్‌ బాదం పప్పు తిని జ్ఞాపక శక్తి పెంచుకోమని మెహబూబా తనదైన శైలిలో స్పందించారు.

మరిన్ని వార్తలు