బీజేపీపై నిప్పులు చెరిగిన మెహబూబా ముఫ్తీ

13 Jul, 2018 12:07 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనే వార్తలపై ఆమె స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతుతోనే తమ పార్టీలో చీలిక వచ్చిందని విమర్శించారు. గతంలో ముస్లిం యూనైటెడ్‌ ఫ్రంట్‌పై అనుసరించిన వైఖరిని పీడీపీపై ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీని హెచ్చరించారు. కేంద్రం 1987లో మాదిరి కశ్మీర్‌ ప్రజల ఓటు హక్కును కాలరాయాలని చూస్తే సలావుద్దీన్‌, యాసిన్‌ మాలిక్‌ వంటి వారు పుట్టుకోస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.   మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ జూన్‌ 19న పీడీపీకి మద్దతు ఉపసంహరించడంతో సీఎం పదవికి ముఫ్తీ రాజీనామా చేశారు. ఇటీవల పీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమె ఈ రకంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ముఫ్తీ వ్యాఖ్యాలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. పీడీపీని చీల్చితే ఒక మిలిటెంట్‌ కూడా పుట్టుకురాడన్నారు. కశ్మీర్‌లో కేవలం ఓట్లను చీల్చడానికి పుట్టిన పార్టీకి అన్యాయం జరిగితే ప్రజలు స్పందిచరని తెలిపారు.

మరిన్ని వార్తలు