గడ్డాలు పెంచుతున్నందుకే ఓడిపోతున్నారేమో!

1 Jul, 2019 11:56 IST|Sakshi

ఓటమికి జెర్సీనే కారణమన్న ముఫ్తి

బీజేపీ చీఫ్‌ ఫైర్‌

ముఫ్తి ట్వీట్‌పై మండిపడుతున్న నెటిజన్లు

శ్రీనగర్‌ : జెర్సీ కారణంగానే ప్రపంచకప్‌లో టీమిండియా పరాజయం పాలైందన్న జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తిపై, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా మండిపడ్డారు. పాకిస్తాన్‌ గెలుపు కోసం ముఫ్తి మనసు పరితపిస్తోందని.. అందుకే ఆమె భారత జట్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్‌ జెర్సీతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో కోహ్లి సేన 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో భారత్‌ తొలి ఓటమికి జెర్సీ రంగే కారణం అంటూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

ఈ క్రమంలో మెహబూబా ముఫ్తి కూడా టీమిండియా ఓటమిపై స్పందించారు. ‘ నన్ను మూఢనమ్మకస్తురాలు అనుకున్నా సరే. ఏదైమైనా ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి జెర్సీనే కారణం’ అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా అంతకుముందు..‘ ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కనీసం క్రికెట్‌ కారణంగానైనా రెండు దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి’ అని ముఫ్తి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ‘మీ మనసులో ఏముందో తెలిసిపోయింది. పాకిస్తాన్‌ కోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అవును.. ఎన్నికల్లో మీరు ఏ రంగు జెర్సీ ధరించారు’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఈ మ్యాచ్‌లో గనుక భారత్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయి ఉంటే సెమీస్‌ రేసు నుంచి నిష్ర్రమించేది. తద్వారా వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్‌ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే.. ఇంగ్లండ్‌పై భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకున్న సంగతి తెలిసిందే.

ఇక టీమిండియా ఆరెంజ్‌ జెర్సీపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆరెంజ్‌ జెర్సీ కారణంగానే భారత్‌ ఓడిపోయిందని అంటున్నారు. పాకిస్తాన్‌ ఎల్లప్పుడు ఆకుపచ్చ జెర్సీనే ధరిస్తుంది కదా. మరి వాళ్లెందుకు ఓడిపోతున్నారు. బహుశా మత గురువుల్లా పొడవాటి గడ్డాలు పెంచుతున్నందుకే వారు ఓడిపోతున్నారామో. భారత్‌ పేరును నాశనం చేసేందుకే ఇలాంటి కొంత మంది వ్యక్తులు కంకణం కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు