కోడి కత్తి కాదు.. నారా వారి కత్తి డ్రామా

5 Jan, 2019 04:39 IST|Sakshi

ఎన్‌ఐఏ విచారణలో ఈ విషయం బయటపడుతుంది

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి

కేసు నీరుగార్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు

తెరవెనుక ఉన్నవారి గుట్టురట్టు కోసమే థర్డ్‌ పార్టీ విచారణ కోరాం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించడం శుభపరిణామమని, దీంతో వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నామని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఇది కోడి కత్తి డ్రామా కాదని, నారా వారి కత్తి డ్రామా అనే విషయం విచారణలో బయటపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను చంపించడానికి కుట్ర పన్నిందెవరో బయటకు రాకుండా కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు. ‘‘విపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన అరగంటలోపే ఈ కేసు ఏవిధంగా దర్యాప్తు జరపాలో డీజీపీ డిక్టేట్‌ చేశారు. డీజీపీ ఆదేశాలకు విరుద్ధంగా ఆయన కింద పనిచేసేవారు ఎలా దర్యాప్తు చేస్తారు? ఈ హత్యాయత్నం వెనుక ఎవరూ లేరని, శ్రీనివాస్‌ అనే వ్యక్తి మాత్రమే ఉన్నారని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇలా చేస్తారని మేం ఊహించే థర్డ్‌పార్టీ విచారణకు డిమాండ్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాం. ఈ నేపథ్యంలో ఈ కేసును కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించింది’’ అని చెప్పారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖలు ఏపీలో విచారణ జరపడానికి వీల్లేదని అడ్డుకుంటూ చంద్రబాబు ఇప్పటికే జీవోలిచ్చారని, రేపు ఎన్‌ఐఏను కూడా ఆయన సామ్రాజ్యం(రాష్ట్రం)లో విచారణ జరపడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమోనని సందేహం వెలిబుచ్చారు.

చిల్లర రాజకీయాలకు నిదర్శనం..
మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి పంపిణీ చేస్తున్న గడియారాలపై చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మిథున్‌ మండిపడ్డారు. తిప్పారెడ్డి తన సొంత డబ్బుతో గత ఆగస్టు నుంచి తన నియోజకవర్గంలోని ప్రజలకు గడియారాలు పంపిణీ చేస్తున్నారని, అందులో ఒకదాంట్లో తమ పార్టీ బొమ్మ వెనకాల టీఆర్‌ఎస్‌ బొమ్మ ఉందని, ఇది తయారీదారు వద్ద జరిగిన చిన్న పొరపాటని, అయితే ప్రభుత్వ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి దీన్ని వీడియో ప్లేచేసి చూపించడం, టీఆర్‌ఎస్‌తో లింకుపెట్టడం చంద్రబాబు చిల్లర రాజకీయాలకు, నీచపు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘‘తిప్పారెడ్డి గుజరాత్‌లో గడియారాల తయారీకి ఆర్డరిచ్చారు. అక్కడ 150 గడియారాల వెనుక పొరపాటున టీఆర్‌ఎస్‌ గుర్తుపేపర్‌ పెట్టామని తయారీదారు తెలియజేశారు. దీన్నెలా రాజకీయం చేస్తారు? పరిటాల శ్రీరామ్‌ వివాహమప్పుడు టీడీపీ నేతలు తెలంగాణ సీఎం ఫ్లెక్సీలు, స్వాగతద్వారాలు ఏర్పాటు చేయడం చంద్రబాబుకు కనిపించలేదా? రాజధాని శంకుస్థాపనకు మీరు (చంద్రబాబు) స్వయంగా కేసీఆర్‌ను ఆహ్వానించలేదా? మీరు కేసీఆర్‌ యాగానికి వెళ్లలేదా? మరిలాంటప్పుడు తయారీదారు ఒక గడియారంలో చిన్న పొరపాటు చేస్తే రాజకీయం చేయడం నీచం కాదా?’’ అని విమర్శించారు. ‘‘ఆంధ్రాలో లూటీ చేసిన డబ్బుతో రేవంత్‌రెడ్డిని బలిపశువును చేయలేదా? హరికృష్ణ చనిపోయిన సందర్భంగా టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం కేటీఆర్‌తో ప్రయత్నించడం నిజంకాదా? మీతో పొత్తుకు ఒప్పుకుంటే టీఆర్‌ఎస్‌ మంచిది.. లేదంటే చెడ్డదా? ఇదేనా బాబు మార్కు నీతి’’ అని నిలదీశారు. 

మరిన్ని వార్తలు