నిబద్ధత.. నా నడత

20 Mar, 2019 10:22 IST|Sakshi

అప్పట్లో ఎన్నికల ప్రచార ఖర్చు రూ.10 లక్షలు

వాజేడు నుంచి అరకు దాకా 450 కి.మీ. మేర ప్రచారం

2004–09 మధ్య భద్రాచలం ఎంపీగా ప్రాతినిధ్యం

‘సాక్షి’తో నాటి జ్ఞాపకాలు పంచుకున్న మిడియం బాబూరావు

సీపీఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టుగా మారిన డాక్టర్‌ మిడియం బాబూరావు ఇప్పటికీ అదే నిబద్ధతతో ప్రజా పోరాట పంథాలో పయనం సాగిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటైన భద్రాచలం స్థానం నుంచి 2004–2009 మధ్య ఎంపీగా సేవలందించిన మిడియం.. తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు.- తూమాటి భద్రారెడ్డి

సాక్షి– కొత్తగూడెం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం పరిధిలోని వాజేడు నుంచి విశాఖపట్టణం జిల్లా అరకు వరకు విస్తరించి ఉన్న అప్పటి భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం 450 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండేది. ఈ నియోజకవర్గం పరిధిలో అప్పటి ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు, భద్రాచలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం (రంపచోడవరం), విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి, పాడేరు శాసనసభ సెగ్మెంట్లు ఉండేవి. ఈ ఏడు సెగ్మెంట్ల పరిధిలో తిరిగేందుకు మిడియం బాబూరావు ఒకే ఒక్క అద్దె వాహనాన్ని ఉపయోగించారు. మొత్తం ఎన్నికల ఖర్చు రూ.10 లక్షలు కూడా కాలేదని మిడియం ‘సాక్షి’కి తెలిపారు. 2004 ఎన్నికల్లో సీపీఎం తరపున సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల మద్దతుతో మిడియం పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొమరం ఫణీశ్వరమ్మపై 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రూ.2కే వైద్యం..
ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన మిడియం బాబూరావు 1951లో జన్మించారు. 1980లో కర్నూలు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. అప్పట్లో భద్రాచలం ప్రాంతం నాన్‌ ముల్కీ పరిధిలో ఉండడంతో కర్నూలుకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెడిసిన్‌ చదువుతున్న సమయంలో సీపీఎం అనుబంధ ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో అందులో చేరారు. ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. సుందరయ్య కోరిక మేరకు అప్పటి సీపీఎం రాష్ట్ర నాయకుడు బాలాజీదాస్‌ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం రాజమండ్రిలో ప్రజా వైద్యశాల స్థాపించి కేవలం రెండు రూపాయలకే వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. అంతకన్నా ముందు పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు రామచంద్రారెడ్డి నెల్లూరులో నడిపే పీపుల్స్‌ పాలీ క్లినిక్‌లో మిడియం పని చేశారు. ఈ క్లినిక్‌ ఇప్పటికీ నెల్లూరులో నడుస్తుండడం గమనార్హం. ఈ ఆసుపత్రి స్ఫూర్తితోనే బాబూరావు రాజమండ్రిలో 1982లో ప్రజావైద్యశాల నెలకొల్పారు. 2006 వరకు దీనిని నడిపారు. వైద్యసేవలు అందజేస్తూనే సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

విధానాల ప్రాతిపదికన ప్రచారం..
అప్పట్లో ఎన్నికల్లో విధానాల ప్రాతిపదికన ప్రచారం సాగేదని, ప్రస్తుతం విచ్చలవిడి డబ్బు ప్రవాహం ప్రాతిపదికన ప్రచారం సాగుతోందని బాబూరావు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న మిడియం వైద్యసేవలు నిలిపేసి పూర్తి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అప్పుడూ, ఇప్పుడూ ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా పని చేయడం ఆనందంగా ఉందని మిడియం చెబుతున్నారు.

ఇప్పుడన్నీ ‘కార్పొరేటీకరణ’రాజకీయాలు
దేశంలో ఆర్థిక రంగంలో 1991లో ప్రారంభమైన నయా ఉదారవాద విధానాలు ప్రస్తుతం రాజకీయ రంగంలోకీ వచ్చాయని మిడియం చెబుతున్నారు. రాజకీయం పూర్తి కార్పొరేటీకరణ అయిందంటున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అవలంబిస్తున్న పాలకవర్గాలు అర్హత లేకున్నా తమకు సన్నిహితంగా ఉండేవారికే అవకాశాలిస్తూ, మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారన్నారు.

పార్లమెంటులో ప్రైవేటుగాపలు బిల్లులు
పార్లమెంటులో ప్రతి సభ్యునికి ప్రైవేటుగా బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌), పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో ప్రవేశపెట్టానన్నారు. తరువాత వీటిని ప్రభుత్వం చట్టం చేసింది. వన సంరక్షణ సమితి ద్వారా కేంద్రం జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో ప్రపంచ బ్యాంకు పథకం ద్వారా ప్లాంటేషన్‌ చేపట్టింది. దీంతో గిరిజనులకు అన్యాయం జరిగింది. దీంతో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. ప్రయోజకులైన వారు కన్నవారిని సాకేలా పెట్టిన బిల్లు సైతం చట్టం అయిందన్నారు. చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కాఫీ తోటలు వేసే రైతులకు గిట్టుబాటు ధర, రాయితీలు ఇచ్చేలా చేయడం సంతప్తిని ఇచ్చిందన్నారు. భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణం తన హయాంలోనే జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు