టీడీపీలో వలసలే సంకేతాలు..!

29 Mar, 2019 08:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల ముందు అధికార పార్టీ టీడీపీ నుంచి నాయకుల వలసలు పెరగడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకుంటున్న నేతలంతా పలు సామాజిక వర్గాలతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేయగలిగిన నేతలే.  వీరిలో సర్పంచుల నుంచి  సిట్టింగ్‌ ఎంపీల వరకూ ఉన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్యెల్యేలు వరుసగా వైఎస్సార్‌సీపీలోకి చేరడం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వేగంగా మారుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నాయి.  గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంవైపు నేతలు అడుగులు వేయలేదని విశ్లేషకులు అంటున్నారు. వాడుకుని వదిలేసే చంద్రబాబు వైఖరితో విసుగెత్తిన ప్రజాప్రతినిధులంతా మునిగిపోయే నావ టీడీపీ నుంచి బయటపడుతున్నారని పేర్కొంటున్నారు. 

అధికార పార్టీలో కలవరం..
తాజా పరిణామాలు టీడీపీ అధినేతకు, అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అనుకూల పవనాలు వీస్తుండడమే నిరంతర చేరికలకు కారణమని టీడీపీ అధినేత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రతో మొదలైన వలసలు ఎన్నికల నామినేషన్లు ముగిసేనాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, టీడీపీని ప్రముఖ నేతలు వీడుతుండటం రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారనేందుకు సంకేతమని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. 

‘తూర్పు’లో ప్రకంపనలు...
తూర్పు గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. ఈ జిల్లాలో వైఎస్సార్‌సీపీలోకి భారీ వలసలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, మరో ముగ్గురు ప్రముఖ నాయకులు కూడా అధికార పార్టీని వీడటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.  వైఎస్సార్‌సీపీలో చేరిన కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ తోట నరసింహానికి పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది.

కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఆయన భార్య తోట వాణి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె. టీడీపీని వీడిన మరో సిట్టింగ్‌ ఎంపీ (అమలాపురం) పండుల రవీంద్రకు అన్ని వర్గాలతో సత్సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పర్వత బాపనమ్మకు ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుంది.

రాజమండ్రికి చెందిన శివరామ సుబ్రహ్మణ్యం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్, కేబుల్‌ టీవీ అధినేత. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఆయన రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లోని 5 నియోజకవర్గాల్లో  ప్రభావం చూపగలరు.   పర్వత రాజబాబు, బెజవాడ సత్యనారాయణలు ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌ సెగ్మెంట్లలో బలమున్న నేతలు.

‘కొత్తపల్లి’ నిర్ణయంతో మారిన సమీకరణాలు
పశ్చిమ గోదావరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ నూర్జహాన్‌  వైఎస్సార్‌సీపీలో చేరారు. రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పలువురితో బంధుత్వాలు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రభావం చూపగల నేత.  మాజీ ఎమ్మెల్యేలు మద్దాల సునీత, మోచర్ల జవహర్‌వతిలకు గట్టి వర్గం ఉంది.

ఏలూరు మేయరు షేక్‌ నూర్జహాన్‌కు బలహీనవర్గాల్లో మంచి గుర్తింపుతోపాటు వ్యాపార వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. తాజాగా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు బలమైన నాయకుడు, వివాదరహితుడు. కాపు సామాజికవర్గంతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు గట్టి వర్గం ఉంది. సీనియర్‌ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ నవీన్‌ జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ సిట్టింగ్‌  ఎంపీ అవంతి శ్రీనివాస్, దాడి వీరభద్రరావుకు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలరు.

విశాఖనుంచి మాజీ ఎమ్మెల్యే  ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామికి కాళింగి సామాజికవర్గంలో విస్తృత సంబంధాలతోపాటు రాజకీయంగా పట్టు ఉంది. టీడీపికి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చేరారు.   

మోహన్‌ బాబు చేరికతో..
సినీ నటుడు, నిర్మాత, విద్యా సంస్థల అధికేత మంచు మోహన్‌బాబు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వెంట హీరో మంచు విష్ణుకూడా ఉన్నారు. తెలుగా రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్, అభిమానులున్న మోహన్‌బాబు చేరికతో  చిత్తూరుజిల్లాలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసిన ఇక్బాల్‌ అహ్మద్, తంబళ్లపల్లినుంచి ’కొండా’ ఫ్యామిలీ గతంలోనే వైఎస్సార్‌సీపీలో చేరారు.  

– యర్రా యోగేశ్వరరావు, ఎలక్షన్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు