వైఎస్‌ జగన్‌కు 25 ఎంపీ సీట్లు ఖాయం

3 Dec, 2018 05:30 IST|Sakshi

‘సాక్షి’ఇంటర్వ్యూలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

ఏపీలో ఓటమి భయంతోనే  ఇక్కడ చంద్రబాబు ప్రచారం

గెలుపు ధీమాలేక కాంగ్రెస్‌ బాబు చేయి పట్టుకుంది

ముస్లింలకు 4% రిజర్వేషన్ల ఘనత వైఎస్‌దే..

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలవబోతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 4 రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముమ్మాటికీ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోతున్నానన్న ఆందోళనతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరారని ఆరోపించారు. ఈ మేరకు అసద్‌ ‘సాక్షి’ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు.

ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ–టీమ్‌ అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై మీరేమంటారు?
అసద్‌: 1998 నుంచి 2012 దాకా కాంగ్రెస్‌ పార్టీకి ఎంఐఎం పార్టీ ఎఫ్‌–టీమ్‌గా ఉంది. 2014–2018 నాటికి బీ–టీమ్‌ అంటోంది. అంటే, రాజకీయాల్లో మా పరిధి పెరిగినట్లేగా!

తెలంగాణలో చంద్రబాబు– కాంగ్రెస్‌ పొత్తును మీరెలా చూస్తారు?
అసద్‌: చంద్రబాబు నాయకుడికి నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. ఏపీలో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు మూటముల్లె సర్దుకుని తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన ఓడిపోతారు.

జాతీయస్థాయిలో సెక్యులర్‌ ఓట్లను చీలుస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ మీపార్టీపై ఆరోపణలు చేస్తోంది కదా!
అసద్‌: క్రితంసారి ఢిల్లీ, కశ్మీర్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మేం పోటీ చేయలేదు. అయినా అక్కడ కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయినట్లు? వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి విజయంపై విశ్వాసం లేదు. అందుకే తెలంగాణలో చంద్రబాబు చేయి పట్టుకుని నడుస్తోంది. 

ఈసారి అదనంగా ఒకస్థానంలో పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లోనూ విజయావకాశాలు ఉన్నాయా?
అసద్‌: దేవుడి దయవల్ల ఈసారి ఒక స్థానం ఎక్కువగా అంటే, 8 స్థానాలు గెలుచుకుంటాం.  

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. మా గొప్పతనమని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది, ఇందులో వాస్తవమెంత?
అసద్‌: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ఘనత ముమ్మాటికీ అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. 2003 డిసెంబర్‌లో మా పార్టీ అధ్యక్షుడు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ, వైఎస్, ఖమ్మం ఎమ్మెల్యే యూనిస్‌ సుల్తాన్‌ ఇంట్లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్‌కు సలావుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. దానికి అంగీకరించిన ఆయన అధిష్టానానికి వివరిస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి, ముస్లిం రిజర్వేషన్ల ఘనత వైఎస్‌దే. 

మరిన్ని వార్తలు