పవన్‌కి అత్తారింటికి దారి ఎటో తెలియదు..

15 Mar, 2018 13:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడి ఎదురుదాడి చేయడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి ...పవన్‌పై ధ్వజమెత్తారు. ‘పవన్‌కు రాజకీయం ఒక సరదా. రాజకీయాలు సినిమా అనుకుని మాట్లాడుతున్నాడు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే వేచి చూశాం. పవన్‌కి అత్తారింటికి దారి ఎటో తెలియదు. ఏ అత్త ఇంటికి పోవాలో కూడా తెలియని పవన్‌...లోకేశ్‌ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్‌ తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

కాపులు భయపడుతున్నారు
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ జనసేనతో కాపులను ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని మంత్రి నారాయణ సూటిగా ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ను చూసి కాపులందరు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ పవన్‌ను పావులా వాడుకుంటుందని, నాలుగేళ్లు పాటు టీడీపీ అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడలేదన్నారు. పవన్‌ దీక్ష ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, ఇన్నాళ్లు ఏం పోరాటం చేశారని ... ఏపీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు.

తక్షణమే క్షమాపణ చెప్పాలి
ప్రశ్నిస్తాను అంటున్న పవన్‌ కల్యాణ్‌.. సోదరుడు చిరంజీవి హోదాపై రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయడంలేదో ముందుగా ప్రశ్నించాలని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ‘ఎంతోమంది నాయకులను మోసం చేసిన చిరంజీవిని పవన్‌ ప్రశ్నించాలి. మీ అన్నని మీరు ప్రశ్నించకపోతే ప్రజలే కాలర్‌ పట్టుకుని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. లోకేశ్‌ అవినీతి చేశాడు అని దారుణంగా మాట్లాడుతున్న పవన్‌...చిన్న ఇల్లు కోసం మీకు రెండు ఎకరాలు కావాలి కానీ...రాష్ట్ర రాజధానికి ఇన్ని అవసరం లేదని అంటారా?. పవన్‌కి రాజకీయ కౌంట్‌ డౌన్‌ ప్రారంభం అయింది. ఇప్పటికైనా లోకేశ్‌, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి’ అని ఆమె సుజాత డిమాండ్‌ చేశారు.

పవన్‌కు ఒక్కరాత్రిలో జ్ఞానోదయం
పవన్‌ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోప్రజల కోసం ఏమి చెబుతారా అని రాష్ట్రం అంతా వేచి చూసిందని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగల అనిత అన్నారు. అయితే ఒక్క రాత్రిలో ఆయనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సభలో కనీసం జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిమాటలో చంద్రబాబుని తిట్టడమే పనిలా మాట్లాడారని అనిత మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎక్కడా మాట్లాడని పవన్‌ నిన్న జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ మాట్లాడటం వెనుక ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. కేంద్రం చేతుల్లో పవన్‌ కీలుబొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు