‘జగన్‌ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు’

2 Nov, 2019 20:05 IST|Sakshi

మంత్రులు ఆదిమూలపు సురేష్‌, అంజాద్‌ బాషా

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వైఎస్సార్‌ జిల్లాలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నా.. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు.

అసత్యాలు రాస్తే చట్టపరమైన చర్యలు..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎల్లో మీడియా అసత్యాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇసుక ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
రెండు నెలలకొకసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు. సమీక్షలు ద్వారా జిల్లా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదు నెలల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేవుడి ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని.. తెలిసి కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇసుక కొరత తీర్చేందుకు సీఎం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని వివరించారు. రోబో స్యాండ్‌ వినియోగంపై క్యాబినెట్‌లో చర్చించామన్నారు. ప్రతి ఒక్కరికి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చంద్రబాబు డైరెక్షన్‌.. పవన్‌ యాక్షన్‌..
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నారని అంజాద్‌ బాషా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో హోదాపై కానీ, ఇతర సమస్యలపై కూడా పోరాడలేదని.. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత పవన్‌కు లేదన్నారు. ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ఫ్రచారాలు చేసినా.. వైఎస్‌ జగన్‌ పరిపాలన పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు