డాక్టర్‌ సుధాకర్‌తో మాట్లాడినట్లు నిరూపిస్తారా?

24 May, 2020 13:41 IST|Sakshi

వర్ల రామయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, మార్కాపురం (ప్రకాశం) : అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు‌ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో దీనిని మేనేజ్‌ చేయడానికి తాను రంగంలోకి దిగినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణలను ఖండించారు. (స్థానికులే చేతులు కట్టేశారు)

డాక్టర్‌ సుధాకర్‌తో గాని, వాళ్ల అమ్మతో గాని నేను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్‌ విసిరారు. మేనేజ్‌ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్‌ సుధాకర్‌ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ డిమాండ్‌ చేశారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!)

టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్‌ చేసినందుకు అనస్తీషియా డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. (డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్)


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా