కేంద్ర మంత్రిపై ప్రకాశ్‌ రాజ్‌ ఫైర్‌

21 Jan, 2018 13:47 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బీజేపీ నేత అనంత్‌ కుమార్‌ హెగ్దే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారు. మొరుగుతున్న కుక్కలకు తాము భయపడబోమంటూ పరోక్షంగా తనను అడ్డుకున్న దళితులపై చిర్రుబుర్రులాడారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని, లౌకిక పదాన్ని త్వరలోనే రాజ్యాంగంలో నుంచి తొలగించనున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్దే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతోపాటు ఆందోళనలు బయల్దేరడంతో అని పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పారు. తాజాగా బెంగళూరు నుంచి బళ్లారి వచ్చిన ఆయన ఓ జాబ్‌ ఫెయిర్‌ను ప్రారంభించేందుకు కారులో వచ్చారు.

ఈ సందర్భంగా కొంతమంది దళితులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. రాజ్యాంగంపై పరుష వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అయితే, జాబ్‌ ఫెయిర్‌ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘మేం మీకు సాయం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాము. ఏదేమైనా మేం మీతో ఉంటాము. మా ప్రజలను బతికించుకునేందుకు మేం ఏమైనా చేస్తాం. వీధి కుక్కల అరుపులకు, ఆందోళనలు, నిరసనలకు మేం తలవంచబోం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ వెంటనే గట్టి కౌంటర్‌ ఇచ్చారు. హెగ్దే ఎన్ని తప్పులు చేస్తారని, ఇక ఆయన ఆపాలని, దళితులను వీధికుక్కలంటూ అవమానిస్తారా? అని ట్విటర్‌లో ప్రశ్నించారు. బీజేపీ సీనియర్‌ నాయకత్వం వెంటనే హెగ్దేను దిగిపోవాలని ఆదేశించాలని, క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు