అలజడి సృష్టించాలని చూస్తున్నారు : అనిల్‌

27 Feb, 2020 20:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రమంతా సంక్షేమ పండుగ చేసుకుంటుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం హైడ్రామా చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే నినాదాన్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చైతన్య యాత్ర అట్టర్ ప్లాప్‌ అయ్యిందని ఎద్దేవా చేశారు.అందుకే ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడమే చంద్రబాబు పని అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నారని మంత్రి అనిల్‌ గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు నందిగం సురేష్, రోజాలపై దాడి చేసింది టీడీపీ శ్రేణులు కాదా అని సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి అనిల్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుపడ్డాయని  గుర్తు చేశారు. రాష్ట్రంలో అశాంతి కోసమే చంద్రబాబు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా ఉగాదినాడు రాష్ట్రంలోని ప్రజలంతా ఇళ్ల స్థలాలతో నిజమైన పండుగ చేసుకుంటారని స్పష్టం చేశారు. (తమాషా చేస్తున్నారా.. చంద్రబాబు బెదిరింపులు)

బాబు కుట్రలను విశాఖ ప్రజలు అర్థం చేసుకున్నారు.. : మేరుగ నాగార్జున
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబు కుట్రలను అర్థం చేసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో రాజధానిలోని దళిత, బహుజనులు కూడా చంద్రబాబును ఛీకొట్టే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. అక్కడి ప్రజలకు సమాధానం చెప్పుకోలేక వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్న రాయలసీమ ప్రజలు, నేడు ఉత్తరాంధ్ర ప్రజలు బాబును అడ్డుకున్నారని గుర్తుచేశారు. రేపు మరిన్ని చోట్ల చంద్రబాబును అడ్డుకునే పరిస్థితి వస్తుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను రాష్ట్రమంతా స్వాగతిస్తుందనడానికి ఈ సంఘటనలే నిదర్శనమని చెప్పారు.(పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..)

చంద్రబాబు చేసేవి పిచ్చి యాత్రలు : నందిగం సురేష్‌
వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలు మాట్లాడుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంత రైతులు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముతున్నారని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై దాడులు చేయించిన నైజం చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు చేసేవి పిచ్చి యాత్రలు అని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారని తెలిపారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తుంటే.. అక్కడి ప్రజలు నిరసన తెలుపకుండా ఆయనను స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. (ఉత్తరాంధ్రపై దండయాత్రకు అమరావతి రాజుగారు..)

హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. చంద్రబాబుకు అమరావతి తప్ప రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. స్వలాభం కోసమే చంద్రబాబు కృత్రిమ పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణను ప్రజలందరు స్వాగతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఉండాలనే వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కృత్రిమ పోరాటాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులా గ్రాఫిక్స్‌ చూపించడం తమకు తెలియదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆవేదనను చంద్రబాబు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా నిరసనలు తప్పవని అన్నారు. 

>
మరిన్ని వార్తలు