‘పవన్‌ను ఎలా పిలవాలో అర్థం కావడం లేదు’

2 Dec, 2019 16:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అజ్ఞాని అని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు.  ప్రభుత్వంపై పవన్‌ చేస్తున్న విమర్శలపై మంత్రి అనిల్‌ మండిపడ్డారు. సోమవారం మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. పవన్‌ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు. 

ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ గత ఐదేళ్లలో ఏమి చేశాడో అందరికీ తెలుసని విమర్శించారు. పవన్‌ నిత్యం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ తన మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. పవన్‌కు తెలుగు మీడియం మీద అంత ప్రేమ ఉంటే.. ఆయన పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. వారిని ఆయన  సన్మార్గంలో పెట్టాలని హితవు పలికారు.

సీఎం వైఎస్‌ జగన్‌పై కడుపు మంటతోనే పవన్‌, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే 2017లో కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనను పట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో జరిగనట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఘటన అని తెలియదా అని నిలదీశారు. పవన్‌ ముందు న్యూస్‌ పేపర్‌ చదవడం నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరి తోలు తీసారో అందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. డిసెంబర్‌ 26న కడపలో ఉక్కు పరిశ్రమకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు