రాజధాని పేరుతో చంద్రబాబు రాజకీయం

9 Feb, 2020 17:24 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరిట ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని మండిపడ్డారు. భీమిలిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు రోజుకోక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  విశాఖలో టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ల్యాండ్‌ మాఫీయాను పూర్తిగా కంట్రోల్‌ చేశామని చెప్పారు. ఆక్రమణలు, భూ కబ్జాల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

స్వాగతించాల్సింది పోయి..విమర్శలా..
ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని మంత్రి అవంతి విమర్శించారు. ఆసియాలో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని పేర్కొన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా పెడతామంటే స్వాగతించాల్సింది పోయి టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అవినీతిపై యుద్ధం చేస్తుంటే టీడీపీ భయం పట్టుకుందన్నారు.

ఆ బాధ్యత ​ కూడా మాదే..
ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లోనే  పూర్తి చేశామని,అమరావతిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు