‘వారి కలల్ని నెరవేర్చేందుకే ఆంగ్ల విద్యా బోధన’

14 Nov, 2019 19:35 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విజయనగరం: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే ఆంగ్ల బోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామంలో గురువారం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక వర్గాల పిల్లలతో సమానంగా పేద విద్యార్థులకు కూడా సమాన విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఆంగ్ల బోధనను అమలు చేయబోతున్నామని వెల్లడించారు. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా.. భవిష్యత్తులో మన పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారని పేర్కొన్నారు. నేడు పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియంలో చదివించాలని ఎంతో డబ్బును ఖర్చు చేస్తున్నారని...అలాంటి వారి కలల్ని నెరవేర్చేందుకే ఈ విధానం తీసుకువచ్చామని వివరించారు.

చంద్రబాబు విధానాలతోనే రాష్ట్రం అధోగతి..
వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమ్మఒడి పేరిట కుటుంబానికి రూ.15వేలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అసభ్య పదజాలంతో దూషించడం సమంజసం కాదన్నారు. ప్రజలు హర్షించరనే విషయాన్ని గ్రహించాలన్నారు. చంద్రబాబు విధానాలతోనే రాష్ట్రం అధోగతి పాలయ్యిందని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రం  ఏర్పడే నాటికి రూ.60వేల కోట్ల రుణం ఉంటే.. నేడు అది గత ఐదేళ్లలో రూ.2.60 లక్షల కోట్లకు చేరిందన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం..
ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అవినీతి, దోపిడీకి  అడ్డూఅదుపు లేకుండా పోయిందని, ఉద్యోగ నియామకాల్లో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్‌సీపీకి అధికారం ఇచ్చారన్నారు. ఏ నమ్మకంతో అధికారం ఇచ్చారో.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని  బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా