అందుకే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారు : బొత్స

26 Aug, 2019 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం త్వరలోనే అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స  సత్యనారాయణ అన్నారు.  కౌలు డబ్బులు ప్రతి రైతుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌలు అందలేదనే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులకు కౌలు చెల్లించాలని సీఎం జగన్‌ ఆదేశించారని, త్వరలోనే కౌలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రకాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు

రాజధాని భూములపై పోరాడుతామంటూ గతంలో  పవన్‌ చాలా చెప్పాడని కానీ ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. రాజధాని భూముల విషయమై చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు కానీ ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన నేతలు గతంలో ఏం మాట్లాడారో..ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారికి స్పష్టత ఉందన్నారు . రాజధానిలో భూములు లేవని టీడీపీ మాజీ కేంద్రమంత్రి అంటున్నారని,  చూపెట్టమని అడిగితే చూపిస్తానని బొత్స సవాల్‌ విసిరారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ వివరాలు సరైన సమయంలో బయటపెడతామని తెలిపారు.

మరిన్ని వార్తలు