ప్రజలు బుద్ధి చెప్పినా.. తీరు మారలేదు.. !

22 Oct, 2019 07:30 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు నీకూ పోలికా.. 

నీ పాలనంతా అవినీతిమయం 

ప్రజలు ఛీత్కరించినా తీరు మారదా? 

చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి కృష్ణదాస్‌ ధ్వజం 

సాక్షి, నరసన్నపేట: ‘ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతికి, చూపించిన నరకానికి ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సీనియార్టీ  పేరుతో చేసిన దారుణాలను చూసి, విశ్రాంతి తీసుకోమని ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు.. అ యినా మీరు మారలేదు.. తన పాలనతో ప్రజ ల ప్రశంసలు అందుకుంటున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డినే విమర్శించడానికి తెగించారు.. ఇది తగదు..’ అని శ్రీకాకుళంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. రెండు రోజు ల పర్యటనకు సోమవారం శ్రీకాకుళం వచ్చిన చంద్రబాబు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశంలోనే ఒక రోల్‌ మోడల్‌ సీఎంగా పేరు తెచ్చుకొని వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రజలందరి మన్ననలు పొందుతుంటే ఓర్వలేక, సిగ్గులేక విమర్శలు చేయడం తగదన్నారు. ‘అసెంబ్లీలో 23 మంది టీడీపీ సభ్యులను పులులుగా మీరు వర్ణించుకుంటున్నారు.. అయితే అవి నిజమైన పులులు కాదు .. కాగితం పులులు’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

ప్రజలు పదేళ్ల తరువాత 2014లో అధికారం ఇస్తే ఒక వర్గానికి, ఒక పార్టీకి ప్రయోజనం కల్గిస్తూ చేసిన పాలన ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇప్పుడు  పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు పథకాలు చేరుతున్నాయని, నీ పాలనలో ఒక్క పథకమైనా సక్రమంగా అమలు చేశావా బాబూ అని మంత్రి నిలదీశారు. ఉచిత ఇసుక పేరున టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో తెలీంది కాదన్నారు. నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పి పారదర్శతకు పెద్ద పీట వేశారని, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ వాహనమిత్ర వంటి పథకాలను కొద్ది కాలంలోనే అమలు చేసి చూపించారన్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ‘నీ తీరు.. నీ ప్రసంగాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. నీ చుట్టూ ఉన్న కొందరు జే కొడితే ఏదో అనుకుంటున్నావు.. వాస్తవాలు గ్రహించండి‘ అని హితవు పలికారు. ‘నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఎవరూ నమ్మరు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అసలు నమ్మరు. నీకు, నీ కోటరీ నాయకులకు ప్రజలు మున్ముందు మరింత దిమ్మతిరిగే తీర్పులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‘ని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రేలాపనలు ఆపి సది్వమర్శలు చేస్తే స్వీకరిస్తామని హితవు పలికారు.   

మరిన్ని వార్తలు