టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ పార్టీ

17 Jan, 2020 15:21 IST|Sakshi
నర్సాపూర్‌ రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌

నర్సాపూర్‌/రామాయంపేట/దుబ్బాకటౌన్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ లౌకికవాద పార్టీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మాట్లాడుతూ.. తమది సెక్యులర్‌ పార్టీ అని, ఎన్‌ఆర్‌సీని తమ పార్టీ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఇతర పార్టీల తరహాలో తమ పార్టీ హైకమాండ్‌ ఢిల్లీలో కాకుండా గల్లీలో ఉంటుందన్నారు. ప్రజలు చెప్పిందే తాము చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు తదితర పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను గౌరవించాలన్న ఉద్దేశంతో బతుకమ్మ పండుగకు హిందువులకు, రంజాన్‌కు ముస్లింలకు, క్రిస్మస్‌కు క్రైస్తవులకు నూతన వస్త్రాలు అందజేసి అన్ని మతాల వారిని గౌరవిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు లేవని హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రెండు నెలల్లో వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు  
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్‌ పరిధిలో శుక్రవారం రోడ్‌షోలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండు నెలల్లో దుబ్బాకలో నిర్మించిన వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలకు ఇస్తామన్నారు. అలాగే రామాయంపేట రోడ్‌షోలో భాగంగా మంత్రి అంబేడ్కర్‌నగర్‌లో కాలనీవాసుల కోరిక మేరకు అక్కడి గుడిసెలను పరిశీలించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు