ఒక్క పంటకైనా మద్దతు ధర కల్పించారా?

11 Apr, 2018 02:55 IST|Sakshi
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఎంపీ కవిత తదితరులు

కాంగ్రెస్‌కు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న  

నిజామాబాద్‌ అగ్రికల్చర్‌: కాంగ్రెస్‌ది స్వార్థ రాజకీయమని, వారికి ఓట్ల పంచాయతీ తప్ప తెలంగాణ అభివృద్ధి సోయి ఉండదని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ.. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఒక్క పంటకైనా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమ లు చేస్తున్నట్లు తెలిపారు.

అన్ని పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు.  రైతు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తేలేదని, తాము అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి పనులను వేగవంతంగా చేస్తున్నా మన్నారు.  ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల గురించి సీడబ్ల్యూసీ చైర్మన్‌ బృందం సందర్శించి భేషుగ్గా ఉందని కితాబిచ్చారన్నా రు. కాంగ్రెస్‌ అభివృద్ధి పనులను అడ్డుకుంటుందని, ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.  

‘మంచిప్ప’బాధితులకు మెరుగైన ప్యాకేజీ 
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంచిప్ప రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బాధితులకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పాత ఇంటికి నష్టపరిహారం అందిస్తామన్నారు. అసైన్‌మెంట్‌ భూమికి సైతం రూ.15 లక్షలు పరిహారం ఇస్తామని హరీశ్‌రావు ప్రకటించారు.  కాగా ముంపు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు