తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు

2 Dec, 2018 05:28 IST|Sakshi
శనివారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. పాల్గొన్న ప్రజలు

కూటమికి ఆంధ్రా నుంచి నోట్ల కట్టలు

రహస్య ఎజెండాతో వస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త

ప్రజలకు మంత్రి హరీశ్‌ హెచ్చరిక

సాక్షి, జనగామ/మహబూబాబాద్‌/కామారెడ్డి/ యాదాద్రి:  నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్‌ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం,  ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్‌ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు.

కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్‌ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు.  

చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు  
చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్‌ కోరారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్‌ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్‌ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్‌ ఇరగదీసే పర్సన్‌ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉత్తమ్‌కే నమ్మకం లేదు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికే కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్‌ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు.

పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్‌కౌంటర్‌లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు