సాయుధులుగానే ఉన్నారు

19 Jun, 2020 06:16 IST|Sakshi

గాల్వన్‌ ఘర్షణ సమయంలో భారత సైనికుల వద్ద ఆయుధాలు ఉన్నాయన్న విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్‌ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్‌ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు.

‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్‌ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పందించారని రాహుల్‌ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్‌లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్‌నాథ్‌ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు