చంద్రబాబుకు ప్రచార ఆర్భాటమే ఎక్కువ: కన్నబాబు

16 May, 2020 20:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మంచిని చంద్రబాబు నాయుడు చూడలేకపోతున్నారని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు ఏదో చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా రైతు రుణమాఫీ కూడా చేయలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబుకు ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప.. ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే లేదన్నారు. సీఎం జగన్‌ మాత్రం చెప్పిన దానికన్న అధికంగా రైతు భరోసా ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులు సీఎం జగన్‌ చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాలతో శనివారం నుంచి ప్రతి రోజు 500 టన్నుల బత్తాయిని కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతు కోసం ఇన్ని మంచి పనులు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు అబద్దాలు చెబుతున్నారో తెలియడంలేదన్నారు. మహానేత వైఎస్సార్‌ శంకూస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగనే పూర్తి చేస్తారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

18 నుంచి రైతులకు విత్తనాలు
మే 18 నుంచి నుంచి రైతులకు విత్తనాలను సబ్సిడీ మీద ఇవ్వబోతున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. జూన్‌లోలో ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగానే చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు 30న ప్రారంభమవుతున్న సందర్భంలో రైతుల అవసరం దృష్ట్యా ముందే విత్తనాలు ఇస్తున్నామన్నారు. విత్తనాల కోసం గ్రామలలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ సారి లక్ష క్వింటళ్ల శనగ విత్తనాలను అధికంగా సిద్ధం చేసినట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు