వారం పది రోజుల్లో స్పష్టత

27 Aug, 2018 02:14 IST|Sakshi

ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య 

ప్రగతి నివేదనసభ ఏర్పాట్ల పరిశీలన 

ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయమెందుకని ప్రశ్న 

సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహేశ్వరం: ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై వారం పది రోజుల్లో స్పష్టత రానుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్‌ 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్‌ రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
 
ప్రజల మనసు దోచుకునే సభ 
రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వంద సీట్లు కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రగతి నివేదన సభ.. ప్రజల మనసు దోచుకునే సభ అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా కచ్చితంగా మాది దోపిడీ సభే.. కాకపోతే ప్రజల మనసు దోచుకునే సభ. ఇంకా దోచుకుంటాం. కాంగ్రెస్‌ పార్టీలా ప్రజల సొమ్ము దోచుకునే సభ కాదు’అని స్పష్టం చేశారు.  

జిల్లాకో పార్కింగ్‌ ఏరియా.. 
ప్రగతి నివేదన సభను 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఇందులో 500 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని, మరో 1,500 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒక్కో జిల్లాకు ఒక పార్కింగ్‌ ఏరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 

నమస్కరించి చెబుతున్నా.. 
‘సెప్టెంబర్‌ 2న ఆదివారం కాబట్టి స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉంటుందని ప్రగతి నివేదన సభను పెట్టుకున్నాం. ప్రజలను సభకు తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను బుక్‌ చేసుకున్నాం. ప్రజలకు నమస్కరించి చెబుతున్నా.. సెప్టెంబర్‌ 2న దయచేసి ప్రయాణాలు పెట్టుకోకండి.. ఆసౌకర్యాన్ని మన్నించి సహకరించండి. పార్టీ సొమ్మునే సభకు ఖర్చు చేస్తున్నాం’అని ప్రజలకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కాగా కేటీఆర్‌ ప్రసంగంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను కొంగర కలాన్‌లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పగా.. సభ మొత్తం రావిర్యాల రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్నారని, రావిర్యాల గ్రామానికి గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిర్యాల గ్రామం పేరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.  జేసీబీ, ఇటాచీలతో తవ్వి సీతాఫలం, వేపచెట్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.  

పెట్టెల్లో డబ్బు పంచుకోవడం ఆయనకే బాగా తెలుసు 
ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి దగుల్భాజీ ప్రేలాపనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యవర్గ భేటీ తర్వాత సూట్‌ కేసుల్లో డబ్బులు పంచుకున్నారని వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. పెట్టెల్లో డబ్బులు పంచుకోవడం ఆయనకే బాగా తెలుసునని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. జైలుకెళ్లి చిప్పకూడు తిన్నోళ్లు చాలా మాట్లాడుతారని.. వాటన్నింటిని పట్టించుకోవాల్సిన తమకు లేదన్నారు. కొంత మంది చిల్లరగాళ్లు ప్రతి పనిని పైసల కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు.  ప్రతిపక్ష పార్టీల ప్రేలాపనలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే జవాబుదారీలమని పేర్కొన్నారు. ఆ పార్టీ బాస్‌లు ఢిల్లీలో ఉన్నారని, లఘుశంక తీర్చుకోవాలన్నా అధిష్టానం పర్మిషన్‌ తీసుకోవాల్సిన దుస్థితి వారిదని ఎద్దేవా చేశారు. 

>
మరిన్ని వార్తలు