విపక్షాలకు గూబ గుయ్యిమనే తీర్పే..

28 Aug, 2018 01:18 IST|Sakshi
సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు

వచ్చే ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య

కాంగ్రెస్‌కు ఎన్నోసార్లు అవకాశమిచ్చారు  

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారికే దించేయాలా? 

కుటుంబ పాలన కాంగ్రెస్‌దా.. మాదా? 

ఎన్నికలకు పోదామంటే భయపడతారెందుకని ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: ‘పేపర్లు, టీవీలు చూస్తుంటే రేపే ఎన్నికలనే హడావుడి కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో పెద్దాయన చూసుకుంటారు. కానీ ఎప్పుడొచ్చినా ప్రతిపక్షాల గూబ గుయ్యిమనే తీర్పొస్తుంది. ఎన్నికలు 3 నెలల్లో వచ్చినా, 6 నెలల్లో వచ్చినా శబ్ద విప్లవంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి తీరుతుంది’అని ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఎన్నో సార్లు అవకాశమిచ్చారని, కానీ టీఆర్‌ఎస్‌ను మాత్రం ఒక్కసారికే దించేయాలని వాళ్లు అంటున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన కేటీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు కాంగ్రెస్సోళ్లు పట్టించిన 60 ఏళ్ల గబ్బుని, దరిద్రాన్ని నాలుగేళ్లలో పోగొట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్ల మీద ఆందోళనలు చేసే పార్టీలా తాము అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాను సీఎం కొడుకునే అయినా ప్రజలు ఆశీర్వదిస్తేనే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు.  


బచ్చా రాహులా.. నేనా? 
‘నన్ను బచ్చాగాడు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు 45 ఏళ్లు. ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎవరు బచ్చా’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తాను 2006 నుంచి ఉద్యమంలో ఉండి జైలుకెళ్లి లీడర్‌ అయ్యానని.. రాహుల్‌ ఏ ఉద్యమంలో పాల్గొని, ఏ జైలుకెళ్లి లీడర్‌ అయ్యారో చెప్పాలని నిలదీశారు. రాహుల్‌ ముత్తాతల నుంచి అమ్మ సోనియా వరకు రాజకీయాల్లో ఉన్నారని, అలాంటప్పుడు ఎవరిది కుటుంబ పాలన అని ప్రశ్నించారు. తాము ఎమ్మెల్యేలకు రూ.కోటి డబ్బాల్లో పెట్టి పంపామని కొందరు ఆరోపిస్తున్నారని.. సంచుల్లో, డబ్బాల్లో డబ్బులు తీసుకెళ్లే అలవాటు తమకు లేదన్నారు. రోజూ తిట్టుకోవడం ఎందుకు.. ఎన్నికలకెల్దాం అంటే దానికీ భయపడతారని, ఓ వైపు భయపడుతూనే మరోవైపు డైలాగులు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలిగానీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 

ముందు అక్కడ అమలు చేయండి 
కాంగ్రెస్‌ అంటేనే దగుల్బాజీ పార్టీ అని, 2009 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీ అమలు చేయకుండా 2019 ఎన్నికల కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త హామీలిస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. వారిచ్చే హామీలను ముందు వా రు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చి నా టీఆర్‌ఎస్‌ 100 సీట్లలో విజయం సా ధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశా రు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నేళ్లు మోసిన జెండాలతో పాటే మన భూములు కూడా బీడులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశా రు. మళ్లీ తుంగతుర్తిలో గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. తుంగతుర్తి ఎమ్మె ల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు