గంగిరెద్దులు వస్తున్నాయి?

5 Apr, 2018 04:33 IST|Sakshi
బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ చిత్రంలో ఉపముఖ్యమంత్రి కడియం, తుమ్మల, సీతారాం నాయక్, ఎర్రబెల్లి

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కేటీఆర్‌ విసుర్లు 

ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఏకపక్ష తీర్పే

వరంగల్‌ అర్బన్, మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి పర్యటన

సాక్షి,మహబూబాబాద్‌/కరీమాబాద్‌:  ‘‘సంక్రాంతి మొన్ననే పోయింది కదా.. ఊళ్లోకి ఇప్పుడెందుకు గంగిరెద్దులు వస్తున్నాయి’’అని కాంగ్రెస్‌ నేతలనుద్దేశించి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు ఎద్దేవా చేశారు. పాలేరులో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చడానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకుల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. బుధవారం వరంగల్‌ అర్బన్, మహబూబాబాద్‌ జిల్లాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షమే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి రైతుబంధు పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.8 వేలు ఇస్తామన్నారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2,630 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ
వరంగల్‌ శివారులోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అథారిటీ, ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఆపరేటర్స్‌లతో  చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. వరంగల్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్‌ ప్లాన్‌పై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్‌ కారిడార్, టూరిజం, టెక్స్‌టైల్‌ పార్కు, ఉద్యోగ కల్పనను దృష్టిలో ఉంచుకుని 9 నెలలుగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి ఔటర్‌ రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కూడా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మాదిరిగా అర్బన్‌ ల్యాండ్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 ఎకరాల మేర ల్యాండ్‌పుల్లింగ్‌ చేయాలని మంత్రి సూచించారు.
 

పిక్‌ ఆఫ్‌ ది డే
షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన పోలీస్‌ జాగిలం

ట్విట్టర్‌లో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన శునకం ఆయన్ని ఆకట్టుకుంది. ‘కుడా’కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనేందుకు సమావేశ మందిరంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న శునకం.. మంత్రికి సెల్యూట్‌ చేసింది. ఆ వెంటనే షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. పర్యటన అనంతరం మంత్రి తన ట్విట్టర్‌లో ఆ ఫొటోను పోస్టు చేస్తూ ‘మై ఫేవరేట్‌ పిక్‌ ఆఫ్‌ ది డే ఫ్రం వరంగల్, రాన్‌ ఇంటూ స్వీటీ, ఈ పోలీస్‌ కెనీన్‌ హూ ఆఫర్‌డ్‌ ఏ వార్మ్‌ హ్యాండ్‌షేక్‌’అంటూ కామెంట్‌ రాశారు.

మరిన్ని వార్తలు