‘ఆ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది’

4 Nov, 2019 20:06 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వస్తోన్న ప్రజాదరణ చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలపై టీడీపీ, జనసేన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. అమరావతికి రాజధాని లేకపోవడానికి కారణం జగనేనని టీడీపీ సిగ్గులేకుండా మాట్లాడుతుందని మండిపడ్డారు. ‘రాజధానిని ఇడ్లీ పాత్రలా కట్టడాలన్నారు.. రాజమౌళి, బోయపాటిలతో నిర్మాణాలన్నారు.. కానీ ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదని’ చంద్రబాబును దుయ్యబట్టారు.

ఆ టెక్నాలజీ ఉంటే  ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..
వైఎస్‌ జగన్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోకపోతే.. టీడీపీ అంతా ఖాళీ అయ్యేదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సహనం కోల్పోయి ప్రవర్తిసున్నారని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో తెలియదా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేనంత వరద వచ్చిందని.. వరదల్లో కూడా ఇసుక తీసుకునే టెక్నాలజీ చంద్రబాబు దగ్గర ఉంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బురద చల్లడం, అసత్యాలను ప్రచారం చేయడం మానుకుని చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఆధారాలు లేని వార్తలు ప్రచురిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇది పత్రికా స్వాతంత్య్రానికి ఏ మాత్రం విఘాతం కాదని కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా