వంద రోజుల పాలనలో విప్లవాత్మక మార్పులు

7 Sep, 2019 12:51 IST|Sakshi

మంత్రి మోపిదేవి వెంకటరమణ

సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన శనివారం విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారం చేపట్టిన  కొద్దిరోజులలోనే ముఖ్యమంత్రి తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. కేవలం వంద రోజుల పాలనలోనే ఎన్నికల హామీలను నెరవేరుస్తూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా సిఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారన్నారు.

ఆర్టీసీ విలీనంతో జగన్‌ చరిత్ర సృష్టించారు..
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని వెల్లడించారు. బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. అవినీతి, రాజకీయ సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. కులాల మధ్య సమస్యలను పరిష్కారించే దిశగా జ్యూడీషియరీ కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పాలనలో విప్లవాత్మకమైన మార్పులకి సిఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో  ప్రజలకి మేలు చేసే 19 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు.

చంద్రబాబు విమర్శలు అర్థ రహితం..
కాకినాడలో చంద్రబాబు చేసిన విమర్శలు అర్థ రహితమని మోపిదేవి ధ్వజమెత్తారు. వంద రోజుల పాలనలో  సీఎం జగన్‌ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. టీడీపీ పునాదులు కూలిపోతున్నాయనే భయంతో చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై  తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ  పునాదులతో సహా  కదిలిపోయిందని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధమని తెలిపారు.

విశాఖ భూ కుంభకోణంపై మరో సిట్‌..
విశాఖ భూ కుంభకోణంపై మరొకసారి సిట్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని మోపిదేవి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

పంచ గ్రామాల సమస్యకు త్వరలోనే పరిష్కారం..
సింహాచలం పంచ గ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని  మోపిదేవి అన్నారు. విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన శనివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో వెంకటేశ్వర రావు, అర్చకులు పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వందరోజుల పాలనలో  ఉద్యోగావకాశాలు కల్పించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మంత్రితో పాటు విశాఖ సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు కొయ్యా ప్రసాద్ రెడ్డి, గాది శ్రీధర్ రెడ్డి, సీతంరాజు సుధాకర్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు