నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణకు షాక్‌

27 Mar, 2019 10:31 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రి నారాయణకు ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్‌తో పాటు పలువురు అనుచరులు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్‌ సీపీలో చేరారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చక పలువురు పార్టీని వీడుతున్నారని.. రామ్మోహన్ రావడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్. చంద్రబాబు అసలు రూపం తెలుసుకుని వైఎస్ఆర్‌సీపీకి మద్దతు ఇస్తున్నారని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు నగరాన్ని 5వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ.. డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఆయన తోడల్లుడు రామ్మోహన్ ప్రశ్నించారు.

కాగా నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నారాయణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత అయిన ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు.

ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని ఆయన టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగిన నారాయణ... చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు.  ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ... పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరలు సమకూర్చేవారు. నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తన విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేరవేస్తూ వైఎస్సార్ సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. దీంతో నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేరవేస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు