‘చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ జీవితమే యూటర్న్‌’

22 Nov, 2019 16:10 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ బాబు.. ఇద్దరూ యూ టర్న్‌కు అలవాటు పడ్డారని మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ఇంగ్లీష్‌ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నేడు ఇంగ్లీష్‌ను తానే తీసుకువచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాను నమ్మిన సిద్ధాంతం యూ టర్న్‌లో దిట్ట అని, తండ్రి లాగే తనయుడు కూడా యూ టర్న్‌కు అలవాటు పడ్డాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దైర్యం లేక మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే గుంటనక్క రాజకీయాలను ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. 

ఇంటి దొంగలను బీజేపీ ఎప్పుడు పట్టుకుంటుందో
ఇంగ్లీష్ మీడియంలో తెలుగు ఉండదని ఎవరు చెప్పారని మంత్రి ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంపై ప్రజల నుంచి మద్దతు రావడంతో బాబు యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును ఆయన కుమారుడు, మనవడు, కోడలు ఇంగ్లీష్ చదువుకోలేదా అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియంపై రాద్దంతం చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ నాయుడు, లోకేష్ ది యూ టర్న్ జీవితమేనని వ్యాఖ్యానించారు.  పిల్లిలా ఉన్న చంద్రబాబును పులిగా చూపించాలని ఎల్లో మీడియా ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడం లేదని చురకలు అంటించారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పిన ఎల్లో మీడియా మొదట పేజీల్లో ప్రచురిస్తుందన్నారు. సుజనా చౌదరి పార్టీ మారిన తరువాత సుజనా కాల్ డేటా పరిశీలిస్తే చంద్రబాబుతో ఎన్ని సార్లు మాట్లాడారో తెలుస్తుందన్నారు. సుజనా చౌదరి వంటి ఇంటి దొంగలను బీజేపీ ఎప్పుడు పట్టుకుంటుందో చూడాలని, కేంద్రం నిర్వహించే విశ్వవిద్యాలయంలో ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చెబుతున్నారని ప్రశ్నించారు.

సుజనా బీజేపీలోకి ఎందుకు వెళ్లారు..
సుజనా చౌదరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని, హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రబాబు డబ్బులిస్తే సుజనా చౌదరి ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. బ్యాంకులను సైతం లూటీ చేసిన ఘనత సుజనా చౌదరిది... సుజనా చౌదరి ఎందుకు టీడీపీతో టచ్లో ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతల ఇంటికి సుజనా చౌదరి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని.. మోదీ గొప్పతనం గురించి సుజనా చౌదరి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు బీజేపీలోకి సుజనా ఎందుకు వెళ్లారో చెప్పాలని, టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, అన్న క్యాంటీన్‌లకు పసుపు రంగు వేస్తే పవన్ నాయుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. మిషనరీ పాఠశాలలో తనకు దేశ భక్తి నేర్పారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వీటిపై ఎందుకు ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. 

చదవండి : ‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’

అలాగే.. ‘దివంగత ఎన్టీఆర్ పార్టీని పెట్టినప్పుడు టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతానని చెప్పిన చంద్రబాబు యూటర్న్ తీసుకొని టీడీపీలో చేరారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనని చెప్పి యూ టర్న్ తీసుకొని మళ్ళీ పొత్తు పెట్టున్నాడు. ఎన్టీఆర్ ఫొటో అవసరం లేదని చెప్పి ..ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఓట్లు కోసం యూటర్న్ తీసుకొని ఆయన ఫొటో పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి యూ టర్న్ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. టీడీపీకి వ్యతిరేకమైన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు సోనియా, మమతా, స్టాలిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు వారిని మర్చిపోయారు. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ, అమిత్ షాను తిట్టిన చంద్రబాబు ఎన్నికల తరువాత యూ టర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళను పొగుడుతున్నారు. పవన్ నాయుడు కోసం టీడీపీ అభ్యర్థిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’ అని చంద్రబాబు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

మరిన్ని వార్తలు