టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి : పేర్ని నాని

13 Dec, 2019 09:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీ ఆవరణలో గురువారం టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మార్షల్‌పై టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు కానివారిని లోనికి అనుమతించరని టీడీపీ సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. గౌరవ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మెప్పుకోసం టీడీపీ సభ్యులు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మార్షల్స్‌పై దుర్భాషలాడిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. మార్షల్స్‌ సభ్యుల భద్రత కోసమే ఉన్నారని తెలుసుకోవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. ఇది పార్టీల వ్యవహారం కాదని.. ఇది సభ అని హితవు పలికారు. సభ్యులు గుంపుగా వస్తున్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా మార్షల్స్‌ తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. అన్నింటిని పరిశీలించిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి : కొడాలి నాని
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ఫ్లకార్డులు, పోస్టర్‌లతో దౌర్జన్యంగా లోనికి వచ్చేందుకు యత్నించారని మంత్రి తెలిపారు. చంద్రబాబే మార్షల్స్‌ను తోసుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి అని విమర్శించారు. టీడీపీలోకి అడ్డగోలుగా చొరబడి.. ఆ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.

చీఫ్‌ మార్షల్‌ బంట్రోతు కాదు.. : ఆర్థర్‌
స్పీకర్‌ ఆదేశానుసారం చీఫ్‌ మార్షల్‌​ వ్యవహరిస్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీ ఆర్థర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. చీఫ్‌ మార్షల్‌ రుల్‌బుక్‌లో ఉన్న రూల్స్‌ అనుసరిస్తారని చెప్పారు. చీఫ్‌ మార్షల్‌ బంట్రోతు కాదని.. డీఎస్పీ స్థాయి అధికారని తెలుసుకోవాలని హితవు పలికారు. చీఫ్‌ మార్షల్‌​ గొంతుపట్టుకొని వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. సభలో టీడీపీ సభ్యులు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు