‘రాజు’ మంత్రి అయ్యారు!

22 Jul, 2020 10:14 IST|Sakshi

మినిస్టర్‌ చాన్స్‌ కొట్టేసిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు

పలాస గడ్డకు తొలిసారి మంత్రి యోగం

చరిత్ర సృష్టించబోతున్న ఎమ్మెల్యే అప్పలరాజు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  వైద్య వృత్తిలో సీదిరి అప్పలరాజుకు మంచి పేరు ఉంది. ఆయన వైద్యమందిస్తే జబ్బు వేగంగా నయమవుతుందని చెబుతుంటారు. ఆయన హస్తవాసి బాగుంటుందని అంటుంటారు. అది మరింత నిజమని అనిపించేలా తొలిసారి ఎమ్మెల్యే అయినా సీదిరికి మంత్రి పదవి దక్కుతోంది. పలాస నియోజకవర్గం ఏర్పడ్డాక ఎవరికీ మినిస్టర్‌ చాన్స్‌ దక్కలేదు. ఆ ఘనత ఎమ్మెల్యే అప్పలరాజుకు దక్కుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

రాజకీయ ప్రవేశమే అనూహ్యం
అసలు ఆయన రాజకీయ ప్రవేశమే అనూహ్యం. వైద్య వృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్‌సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సీదిరి అప్పలరాజు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. నియోజకవర్గంలో ఎదురే లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్‌ సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల ఆధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీసాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో ఆయన చూపిన చురుకుదనం, సమస్యలపై అవగాహన, వాక్‌ చాతుర్యం, పార్టీకి విధేయత ఇవన్నీ ఆయన రాజకీయ ఎదుగదలకు దోహదపడ్డాయి.

పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ తనదైన గుర్తింపు పొందారు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఇతరత్రా పరిస్థితుల  నేపథ్యంలో ఏకంగా మంత్రి అయ్యే చాన్స్‌ కొట్టేశారు. శాసనమండలి రద్దు తీర్మానం నేపథ్యంలో ఎమ్మెల్సీ హోదాతో మత్స్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ తదనంతర రాజకీయ పరిణామాల్లో రాజ్య సభకు ఎంపికవ్వడం, అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేయడం, అదే సామాజిక వర్గం నుంచి ఆ కొలువును భర్తీ చేయా ల్సి రావడంతో సీదిరి అప్పలరాజుకు ఆ అదృష్టం వరించబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1.29గంటలకు అమరావతిలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన అమరావతికి చేరుకున్నారు.    

పేద కుటుంబంలో పుట్టి..
వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో మత్స్యకార కుటుంబంలో జన్మించిన సీదిరి అప్పలరాజు వైద్య విద్య అభ్యసించారు. సొంతగ్రామం ఎంపీయూపీ స్కూల్‌ 1నుంచి 7వ తరగతి వరకు, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సింహాచలం(అడివి వరం స్కూల్‌) గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. పదో తరగతిలో స్టేట్‌ నాలు గో ర్యాంకు సాధించారు. గాజువాక  మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసి, ఓపెన్‌ కేటగిరిలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వెంటనే ఎంట్రన్స్‌ పరీక్షలో పాసై కేజీహెచ్‌లో ఓపెన్‌ కేటగిరిలో పీజీ సీటు సాధించారు. ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చేసి పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించారు. నిత్యం ప్రజలలో ఉంటూ, పేదవారికి తక్కువ ధరకే వైద్య సేవలందించారు. క్రీడలకు కిట్‌లు పంపిణీ, బహుమతులు అందించడం వంటివి చేసేవారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నియోజకవర్గంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.   

అమరావతి చేరుకున్నసీదిరి  
కాశీబుగ్గ : పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మంగళవారం అమరావతి చేరుకున్నారు. బుధవారం కేబినెట్‌లో జరగనున్న మంత్రివర్గ విస్తరణకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సోమవారం రాత్రి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జిల్లా, పలాస నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు