నేను చెప్పిందే చేయాలి.. మీ రూల్‌ నడవదు

17 Oct, 2017 10:30 IST|Sakshi

అధికారులపై మంత్రి పుల్లారావు ఆగ్రహం

చిలకలూరిపేటటౌన్‌ : ‘‘ఏమయ్యా ఆర్డీవో..నేను చెప్పింది చేయండి.. మీ ఇష్టమొచ్చినట్లు కాదు.. ఇక్కడ మీ రూల్స్‌ నడవవు.. రూల్‌ ప్రకారం చేయాలంటే దేశంలో ఏవీ జరగవు. రూల్స్‌ గురించి నా దగ్గర ఎక్కువగా మాట్లాడొద్దు..అలా చేస్తే నువ్వు సమాధానం చెప్పుకోలేనన్ని ప్రశ్నలు అడుగుతా’’ అంటూ  పౌర సరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెం దిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో అధికారులపై రెచ్చిపోయారు. ఏం చెప్పినా చేయడంలేదని అనేక ఫిర్యాదులు చేశారు. స్పందించిన మంత్రి ఆన్‌లైన్‌ నమోదు నుంచి పొజిషన్‌ సర్టిఫికెట్ల మంజూరు వరకు ఏ చిన్న పని కూడా ఎందుకు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధమైన పనులు తాము చేయడం లేదని అధికారులు జవాబు చెప్పడంతో మంత్రి పైవిధంగా విరుచుకుపడ్డారు.

ఫిర్యాదులు ఇలా..
ఇళ్లు మంజూరు అయినా పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని యడ్లపాడు మండల అధికార పార్టీ నేతలు అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఎం చెప్పినా మీరింకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని మంత్రి ఆర్డీవోని ప్రశ్నించారు. ఉత్తర్వులు తమకు అందలేదని జవాబిచ్చారు. అదేం కుదరదు, ఇళ్లు మంజూరు అయిన వాళ్లకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. ఒక టీడీపీ నేత అందరి ముందు మహిళా అధికారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. వేలు చూపిస్తూ బెదిరించాడు. దీనిపై అందరూ ఆశ్చర్యపోయారు. స్పందించిన పుల్లారావు జనాలను ఏడిపించడం మీకు బాగా అలవాటైపోయింది, రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు