‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

3 Nov, 2019 19:26 IST|Sakshi

పవన్‌కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణు ధ్వజం

సాక్షి, విజయవాడ: వరదల కారణంగానే ఇసుక కొరత తలెత్తిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం ఈ ఇద్దరూ వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 70 రోజుల నుంచి వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి చూస్తే పవన్‌ కల్యాణ్‌కు పరిస్థితి తెలుస్తుందన్నారు.

లాంగ్‌మార్చ్‌లు, యాత్రలు సముద్రం ఒడ్డున కాకుండా కృష్ణా, గోదావరి నదుల వద్ద చేయాలని సవాల్‌ చేశారు. టీడీపీ హయాంలో కొల్లగొట్టిన ఇసుకంతా వరదల ద్వారా మళ్లీ నదుల్లోకి చేరిందన్నారు. ఐదేళ్లకు సరిపడా ఇసుక ఇప్పుడు నదుల్లో ఉందని మంత్రి తెలిపారు. వరద తగ్గగానే ఇసుక వారోత్సవాలు నిర్వహించి కొరతను తీరుస్తామన్నారు. చంద్రబాబు చేసిన ఇసుక దోపిడీని అరికట్టడానికే ఇసుక పాలసీ తీసుకువచ్చామని పేర్కొన్నారు.

రెండు స్థానాల్లో ఓడినా బుద్ధి రాలేదు..
చంద్రబాబు సొంత కొడుకు గుంటూరులో నిరసన దీక్ష చేస్తే..  వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ లాంగ్మార్చ్ చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. రాజకీయం చేయడానికే లాంగ్‌మార్చ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ప్రజలు ఓడించారని.. అయినా ఆయనకు బుద్ధి రాలేదని అన్నారు. ఆయనను ప్రజలు నమ్మేపరిస్థితి  లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే..
చంద్రబాబుకు అమ్ముడుపోయి.. పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌లు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుకదోపిడీకి పాల్పడితే ఏ రోజైనా లాంగ్‌మార్చ్‌లు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ లాంగ్‌ మార్చ్‌ చేపట్టారని విమర్శించారు. ఇసుక కొరత మానవ తప్పిదం అంటూ అవాస్తవాలు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోచుకున్న టీడీపీ నేతలతో కలిసి పవన్‌ లాంగ్‌ మార్చ్‌ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వనరుల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు తప్పుబట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు