రాజధాని తరలింపు కాదు..అభివృద్ధి వికేంద్రీకరణ

4 Jan, 2020 12:20 IST|Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పునాదులు వేయడానికి జీఎన్‌ రావు, బీసీజీ కమిటీలు మంచి నివేదికలు ఇచ్చాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని తరలిపోతుందని ప్రజలను కొందరు రెచ్చ గొడుతున్నారని.. రాజధాని తరలింపు కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని వివరించారు. అమరావతి పేరుతో  ప్రజలను చంద్రబాబు ప్రలోభ పెట్టారని విమర్శించారు. లక్ష తొమ్మిది వేల కోట్లతో రాజధానిని నిర్మించకుండా ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నం ఆయన చేశారని.. అమరావతి తన సృష్టేనంటూ గొప్పులు చెప్పుకునేందుకు యత్నించారని దుయ్యబట్టారు. రూ.5వేల కోట్లను ఒకేచోట వ్యచించే బదులు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఖర్చు పెట్టి రెండింటిని అనుసంధానం చేసి ఉంటే అభివృద్ధి జరిగేదన్నారు.

అందుకే స్వార్థ నిర్ణయం తీసుకున్నారు..
స్వలాభం, బినామీలకు మేలు చేకూర్చడానికే చంద్రబాబు స్వార్థ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పంటలు పండే నేలను బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని.. చంద్రబాబు చేసిన పాపానికి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు బాధ పడే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ జిల్లాను  విస్మరించరని.. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమే ఆయన సంకల్పమని స్పష్టం చేశారు. 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా కమిటీలు వేసి వాటి నివేదికలను పరిశీలిస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవన్నీ గమనించాలని సూచించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు దురుద్దేశంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

మెట్రోను కూడా ఆయన కాపాడుకోలేకపోయారు..
రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం ఉత్తరాంధ్ర లో హైకోర్టు కర్నూలు లో ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 6న రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈలోపే రైతులకు నష్టం వాటిల్లినట్టు..చంద్రబాబు మీడియా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గ్రీన్‌ఫిల్డ్‌ నగరాలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని..నగరానికే పరిమితం కానీ గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానికి కాదన్నారు. విజయవాడకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెట్రో రైలును కూడా చంద్రబాబు కాపాడుకోలేపోయారన్నారు.

ఆ భ్రమలోనే చంద్రబాబు గడిపారు..
నాలుగేళ్లు బీజేపీతో పార్ట్‌నర్‌గా ఉన్న చంద్రబాబు.. రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. భూములు రేట్లు పెరిగే విధంగా.. తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేవిధంగా చంద్రబాబు చేశారన్నారు. విజన్‌ 2020, 2030, 2050 పేరుతో చంద్రబాబు అపోహలకు పోయారని.. తాను 30 ఏళ్లు, 50 ఏళ్లు పరిపాలిస్తాననే భ్రమలో గడిపారన్నారు. పవన్‌కల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. స్వార్థ ప్రయోజనాలు కోసం పనిచేస్తే మట్టి కొట్టుకుపోతారన్నారు. అమరావతిని భ్రమరావతిగా చంద్రబాబు గ్రాఫిక్స్‌ రూపంలో చూపించారని.. పచ్చని పంటపొలాలను ధ్వంసం చేయవద్దని శివరామకృష్ణ కమిటీ సూచిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజన్‌ ఉన్న వ్యక్తి  అని.. ప్రజలు ఆయన వెంటే ఉంటారన్నారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3 పంటలు పండే భూములను చంద్రబాబు నాశనం చేశారని.. కమిటీల సూచనలు పట్టించుకోకుండా మూర్కత్వంగా ప్రవర్తించారన్నారు. రెండు గాజులు ఇవ్వడం కాదు..రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  హై పవర్ కమిటీ రెండు నివేదికలను పరిశీలించి.. రాష్ట్ర అభివృద్ధికి అనువైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని  మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

మరిన్ని వార్తలు