అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు?

27 May, 2020 11:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 దేవాలయాలు కూల్చేసినపుడు కూడా కన్నా మాట్లాడలేదని, బాబు ఇచ్చిన డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారన్నారు. బుధవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ ఆస్తులని అమ్మాలని సంతకాలు కూడా చేశారు. భాను ప్రకాష్ రెడ్డి విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదు. అప్పట్లో నేను బీజేపీలో ఉండి దేవాలయాలు పడగొట్టే అంశాన్ని అడ్డుకుంటే నన్ను అరెస్ట్ చేశారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ( ‘ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా)

మీరు అమ్మాలనుకున్న ఆస్తులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపితే నిరాహార దీక్ష చేస్తారా? దేవాలయాల డబ్బులు తీసుకుని వెళ్లి ఇమామ్‌లకి, పాస్టర్లలకి ఇస్తున్నారన్న దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. టీటీడీ ఆస్తుల గురించి ఫిబ్రవరిలో చర్చించాం అంతే. డబ్బులకి అమ్ముడు పోయి ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని మీరిలా మాట్లాడటం సబబు కాదు. పవన్ కళ్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు, చేతిలో దేవుడి పటం ఉంటుంది. వీళ్ళు కూడా టీటీడీ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం')

భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి: మల్లాది
విజయవాడ :
టీటీడీ ఆస్తుల అమ్మకం సమయంలో టీడీపీతో జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని, అప్పుడు వారెవరూ దీని గురించి నోరు విప్పలేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో బీజేపీలో ఉన్నారని తెలిపారు. భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. జనసేనలో ఉన్న నాగబాబు గాడ్సేని భుజాన వేసుకుని మాట్లాడారని, ఆయనకి దేవాలయాల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా