మంత్రి యనమల వేధింపులు

20 Dec, 2018 03:55 IST|Sakshi
ఎమ్మెల్యే రాజాతో నోటీసు విషయంపై వివరిస్తున్న సుధాకర్‌

మూడేళ్ల  తర్వాత  పాత కేసు తెరపైకి 

తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు పోలీసుల నోటీసులు 

తుని (తూర్పుగోదావరి): ప్రజల తరఫున పోరాటం చేస్తే తనపై అన్యాయంగా కేసులు పెట్టించిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఇప్పుడు ఆ కేసును బయటకు తీయించి వేధింపులకు గురిచేస్తున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం సాయంత్రం తుని రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ 2015లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన సీఆర్‌పీసీ 41 నోటీసును ఎమ్మెల్యే రాజాకు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజా విలేకరులతో మాట్లాడారు. తుని మండలం డి.పోలవరానికి చెందిన రైతులు 17–07–2015న ఇసుక అక్రమంగా తవ్వుతున్నారని ఫోన్‌ చేస్తే గన్‌మెన్‌తో కలిసి వెళితే.. టీడీపీ నేతలు దాడి చేశారన్నారు.

ఇడెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ కేసును తిరగదోడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ప్రతి ఘటనలోనూ యనమల సోదరుల ఒత్తిడితో కేసులు బనాయించారన్నారు. పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకు పాత కేసులను బయటకు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని రాజా తెలిపారు.

మరిన్ని వార్తలు