మంత్రి యనమలకు ఘోర అవమానం!

13 Aug, 2018 16:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్‌రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్‌ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది.

అవకాశం దక్కని మంత్రులు!
మంత్రి యనమల రామకృష్ణుడితోపాటు తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడులకు అవకాశం దక్కలేదు.
కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి  కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకపోయినప్పటికీ.. ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు.


స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేయనున్న మంత్రుల జాబితా ఇదే

 • విజయనగరం- గంటా శ్రీనివాసరావు
 • విశాఖపట్నం - నిమ్మకాయల చినరాజప్ప
 • తూర్పుగోదావరి - కాల్వ శ్రీనివాసులు
 • పశ్చిమగోదావరి - ప్రత్తిపాటి పుల్లారావు
 • కృష్ణా - పరిటాల సునీత
 • గుంటూరు-  సీహెచ్ అయ్యన్నపాత్రుడు
 • ప్రకాశం - పీ. నారాయణ
 • నెల్లూరు - ఎన్. అమర్‌నాథ్‌రెడ్డి
 • కడప - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
 • కర్నూలు - కేఈ కృష్ణమూర్తి
 • అనంతపురం- డీ ఉమామహేశ్వరరావు
 • చిత్తూరు - ఎన్ ఆనందబాబు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు