మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం బాధాకరం: దత్తాత్రేయ

4 Jan, 2019 00:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేసి 22 రోజులైనా ఇప్పటికీ మంత్రిమండలిని విస్తరించకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మంత్రులు లేకపోవడంతో పాలనాపరమైన శాఖల్లో పనితీరు లోపించిందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలసి రాష్ట్రంలో పలు రహదారుల అభివృద్ధిపై వినతిపత్రాన్ని ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట–ఎల్కతుర్తి, జనగాం–దుద్దెడ, మెదక్‌–ఎల్లారెడ్డి, ఫకీరాబాద్‌–బైంసా, సిరిసిల్ల–కామారెడ్డి, వలిగొండ–తొర్రూర్, నిర్మల్‌– ఖానాపూర్‌ రహదారులను జాతీయ రహదారుల ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేయాలని కోరినట్టు చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో రహదారుల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు