సీఎం జగన్‌ రాజకీయంగా పునర్జన్మనిచ్చారు!

4 Dec, 2019 20:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌

సాక్షి, విజయవాడ: తాను ప్రత్యర్థిగా పోటీ చేసినా ఏదీ మనసులో పెట్టుకోకుండా మంత్రి కొడాలి నాని సహకరించారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. విజయవాడలో బుధవారం తన ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరడానికి సహకరించిన వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. ‘నా తండ్రి దేవినేని రాజశేఖర్‌కు 40 ఏళ్లుగా తోడున్న ప్రతి కార్యకర్తకు, నాయకులందరికీ అభినందనలు. నాకు జన్మనించింది నా తండ్రి రాజశేఖర్‌ అయితే.. రాజకీయ పునర్ జన్మనిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లతోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. అవినాష్‌ మంచి నిర్ణయం తీసుకుని వైఎస్సార్‌ సీపీలో చేరాడని, తండ్రిని మించిన తనయుడిగా అవినాష్‌ రాజకీయాలలో ఎదగాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోతున్నావని నాపై పోటీ చేసినప్పుడే అవినాష్‌కు చెప్పాను. చంద్రబాబును తిట్టిన వారిలో మొదటి వ్యక్తి దేవినేని రాజశేఖర్‌ అయితే తరువాతి స్థానంలో నేనుంటాను. చంద్రబాబు నాకు, అవినాష్‌కు మధ్య పోటీ పెట్టి తనని దెబ్బకొట్టాలని చుశాడు,’ అని మంత్రి పేర్కొన్నారు. గుడివాడలోని ప్రజలను కులాల, మతాల వారిగా విడగోట్టాలనే ప్రయత్నంతోనే చంద్రబాబు అవినాష్‌ను పోటీకి దింపాడని విమర్శించారు. చంద్రబాబు ఇంటి పక్కనే మత మార్పిడి జరిగితే సీఎం జగన్‌పై విమర్శలు చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబులు తమ పార్టీలను బీజేపీలో విలీనం చేయాలకుంటే తమకేమి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. హిందూ మతానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా చంద్రబాబు, పవన్‌లు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీపై కుయక్తులు పన్నుతున్నారని మంత్రి నాని వ్యాఖ్యానించారు.  

మంత్రి పెర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ కుమ్మక్కై ఉసరవెల్లిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ‘పవన్‌ సినిమాలో నటిస్తే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే వస్తాయి. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినట్లు చేస్తే పవన్‌కు రూ.450 కోట్లు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల్లో నటించడం కంటే చంద్రబాబు చెప్పినట్లు నటిస్తే మంచిదని పవన్‌ ఫిక్సైనట్లున్నాడని మంత్రి ఏద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వెంటనే దేవినేని అవినాష్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ తూర్పు ఇన్‌చార్జి ఇచ్చారంటే.. అది అవినాష్‌పై ఉన్న నమ్మకమని ఆయన అన్నారు. నెహ్రూను ఎప్పుడో పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తప్పటడుగు వేశారని పేర్కొన్నారు. విజయవాడలో అన్ని కార్పొరేషన్లు గెలిచి చూపించాలన్నారు. విజయవాడ మేయర్ సీటును వైఎస్సార్‌సీపీ గెలవాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి నవరత్నాలు చేరే విధంగా పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు వస్తామని.. కులం ,మతం, ప్రాంతం చూడకుండా అందరి శ్రేయస్సు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశంసించారు.

టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేవినేని అవినాష్‌తో పాటు వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ‘నా తమ్ముడులా అవినాష్‌ను చూసుకుంటనని’  సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నవరత్నాలు ప్రతి పేదవానికి చేరాలనే సంకల్పంతో సీఎం జగన్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు. హామీలు ఇవ్వని పధకాలను కూడా చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. కొద్దిరోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని.. విజయవాడ కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకునేలా అందరు కార్యకర్తలు పాటుపడాలని ఆయన కోరారు. అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలిచేలా పాటుపడాలని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి రెహ్మాన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ది ఎలక్షన్ కలెక్షన్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక పవన్, చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని రెహ్మాన్ ధ్వజమెత్తారు.

దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ రోజుకో మాట.. పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకరోజు హిందువులకు అనుకూలం అంటాడూ.. మరొకరోజు వ్యతిరేకం  అంటాడని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రోజుకొక వేషం వేస్తున్నాడని విజయవాడ నుంచే పవన్‌కు గట్టి బుద్ధి చెబుతామని వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.


 

మరిన్ని వార్తలు