సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

24 Jul, 2019 14:50 IST|Sakshi

వైఎస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించే బిల్లును మంత్రి గుమ్మనూరు జయరాం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సభలో నవ్వుల పువ్వులు పూయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఆయా వర్గాలకు నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ రోజు మంత్రిస్థానంలో తాను ఉన్నానంటే అందుకు కారణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. తాము మంత్రులు కావాలని బ్రహ్మరాత రాశాడో లేదో తెలియదు కానీ, జగన్‌ అన్న మాత్రం ఆ రాత తమ నుదుటిమీద రాశారని కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అంటే తనకు ప్రేమ ఎక్కువని, ఆయనను తాను అన్నా.. అని పిలుస్తానని చెప్పారు.  

2017లో పాదయాత్ర చేస్తుండగా జగనన్నను కలిశానని, మీరు మాపాలిట దైవసంకల్పమని ఆయనకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. తాను వాల్మీకి బోయ కులానికి చెందినవాడినని, తమ బోయ కులస్తులకు వైఎస్‌ జగన్‌ వాల్మీకి మహర్షి అంతటి వారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఆయనను ఎస్సీలకు అంబేద్కర్‌గా, ముస్లింలకు అల్లాగా, క్రైస్తవులకు జీసెస్‌గా అభివర్ణించారు. ఆ కోవలోకి చెందిన మహానుభావులు మీరని 2017లోనే  వైఎస్‌ జగన్‌తో చెప్పినట్టు గుర్తుచేశారు. జయరాం వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. సీఎం వైఎస్‌ జగన్‌ సహా సభలోని సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత కులం, మతం, పార్టీలు చూడకుండా అందరూ సమానులేనని వైఎస్‌ జగన్‌ అన్నారని, సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై అంటూ శిరిడీ సాయిబాబా పేర్కొన్నరీతిలో వైఎస్‌ జగన్‌ కూడా సబ్‌ కా మాలిక్‌ అని కొనియాడారు. ఈ సమయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం కల్పించుకొని.. ఇంతకీ మన బిల్‌ సంగతి చూడండంటూ సూచించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. 

మరిన్ని వార్తలు