హోదా కేంద్రం పరిధిలోనే ఉంది

4 Feb, 2020 04:30 IST|Sakshi

పదిహేనో ఆర్థిక సంఘం ఈ విషయం స్పష్టం చేసింది

ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం

మైనారిటీల్లో అభద్రతాభావాన్ని తొలగించాలి

పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలి

రాజధానిలో చంద్రబాబు కుంభకోణానికి పాల్పడ్డారు

అధికార రహస్యాలను స్వార్థానికి వాడుకున్నారు

ధన్యవాద తీర్మానంపై చర్చలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి    

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, ఈ విషయాన్ని పదిహేనో ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని మరోసారి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘ మా పార్టీ ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తోంది. మైనారిటీ సోదరుల నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా దీనికి సంబంధించి జారీచేసిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం ఎన్‌పీఆర్‌లోని ప్రశ్నావళిని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. మైనారిటీల్లో అభద్రతాభావాన్ని తొలగించాలి. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిందని మేం సీఏఏకు మద్దతిచ్చాం. కానీ ప్రతిరోజూ వీధుల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వారి ఆందోళనను పరిష్కరించాలి. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నారు. 

విభజన హామీలు నెరవేర్చండి
‘మా రాష్ట్ర అంశాల్లోకి వస్తే.. మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆర్థిక ఇబ్బందులతో మా రాష్ట్రం ఏర్పడింది. దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతూ వచ్చాం. సభ సాక్షిగా దానిపై ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దీనితోపాటు ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలూ నెరవేర్చాలని అడుగుతూ వస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా వీటిపై స్పందించాలి. 14వ ఆర్థిక సంఘం చెప్పినందున ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం.. ప్రత్యేక హోదాతో తమకు సంబంధం లేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. అది కేవలం కార్యనిర్వాహక నిర్ణయం మాత్రమే. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదికి రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని విభజన రోజున చెప్పారు. అది రూ. 22,900 కోట్లుగా సీఏజీ తేల్చింది. కానీ కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదు.

వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికాబోతోంది. ఇందుకు కేంద్రం త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. గడిచిన ఆరు నెలలుగా రూ. 5 వేల కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నా ప్రాజెక్టు వేగవంతంగా నిర్మిస్తున్నాం. దీనిపై పెట్టిన ఖర్చుకు వడ్డీయే రూ. 500 కోట్లుగా ఉంది. ప్రధాని ఈ విషయం గుర్తించాలని కోరుతున్నాం. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లా అయిన వైఎస్సార్‌ జిల్లాలో స్టీలు ప్లాంటు నిర్మించాల్సి ఉంది. కేంద్రం దీనికి సాయం చేయాలి. రాష్ట్రాలకు సాయం చేయకుండా, వాటి ఆకాంక్షలు నెరవేర్చకుండా దేశం 5 ట్రిలియన్ల ఎకానమీ సాధించడం కష్టం..’ అని పేర్కొన్నారు.

రాజధాని కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని తిరువూరులో వస్తుందని చెప్పారు. మూడు నెలల కాలం ఆయన మనుషులు అమరావతి ప్రాంతంలో భూములు కొనే పనిలో ఉన్నారు. టీడీపీ నేతలు దాదాపు 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. కొనుగోళ్ల కార్యక్రమం పూర్తయ్యాక తిరువూరు కాదని, అమరావతిలో రాజధాని వస్తుందని ప్రకటించారు. 4 వేల ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ముఖ్యమంత్రిగా ఉండి అధికార రహస్యాలను స్వార్థానికి వాడుకున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కోట్లాది రూపాయల విలువ గల భూములను ఎలా కొన్నారు? ఈడీ రంగంలోకి దిగిందని విన్నాను.

తప్పుడు ధ్రువీకరణలతో భూములు కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం దేశవ్యాప్తంగా తిరిగి మోదీ పాలనకు, బీజేపీకి చరమగీతం పాడుతామని చెబుతూ వచ్చారు. రాహుల్‌ని ప్రధానిని చేస్తానన్నారు. కానీ ఈరోజు టీడీపీ వాళ్లు కాంగ్రెస్‌ వాళ్ల పక్కన కూర్చునేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఈ రోజు మా వెనుక కూర్చున్నారు. మా వెనుక నుంచి వాళ్లు గోల చేసినా మాకు నష్టం లేదు. ఎందుకంటే వారికి చంద్రబాబు ఇచ్చిన అసైన్‌మెంట్‌ అది. కుంభకోణాల నుంచి రక్షించాలని చంద్రబాబు వారిని కోరారు. ఎలాంటి అవినీతి లేకుండా అద్భుత పనితీరు కనబరుస్తున్న యువ ముఖ్యమంత్రికి ఈ సభ ఆశీస్సులు కావాలని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు.

టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు
‘ఇటీవల బీఏసీ సమావేశంలో టీడీపీ రెండు అంశాలు లేవనెత్తింది.. ప్రాజెక్టులు రద్దు చేస్తున్నారని, రాజధానిని మారుస్తున్నారని ఆరోపించింది. దీనిపై అనేకమార్లు వారు మాట్లాడుతున్నందున సభకు స్పష్టత ఇవ్వ దలచుకున్నా.. మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మేం అధికారంలోకి వచ్చేసరికి రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు మా ముందు పెట్టారు.  మరో రూ. 20 వేల కోట్ల అదనపు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టునూ రద్దు చేయదలుచుకోలేదు. కేవలం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి వ్యయాన్ని తగ్గించుకోవాలనుకుంది. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టును అప్పటి సీఎం ఒక ఏటీఎంలా మార్చేశారని, అది అవినీతిమయమైందని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇది నిజమేనని రివర్స్‌ టెండరింగ్‌  ద్వారా రుజువైంది. ఒక్క ప్రాజెక్టులోనే రూ. 800 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి సీఎం రూ. 70 వేల కోట్లతో పాజెక్టులకు టెండర్లు పిలిచారు. అన్ని టెండర్లు 5 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు.  రివర్స్‌ టెండరింగ్‌లో ఆ ప్రాజెక్టులకు 10 నుంచి 20 శాతం తక్కువకే టెండర్లు ఖరారు చేశారు. ఉదాహరణకు వెలిగొండ టన్నెల్‌ ప్రాజెక్టును ఎన్నికలకు ముందు ఓ కాంట్రాక్టర్‌ 5 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్నారు. రివర్స్‌ టెండరింగ్‌లో అదే కాంట్రాక్టర్‌ 15 శాతం తక్కువకు తీసుకున్నారు. చవక గృహాల నిర్మాణం విషయంలో ఒక భాగం టిడ్కో, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం, ఒక భాగం లబ్దిదారుడు భరించాలి. ఎస్‌ఎఫ్‌టీకి రూ. 2,200 చొప్పున కాంట్రాక్టు ఇచ్చారు.

రివర్స్‌ టెండరింగ్‌ లో మేం రూ. 400 ఆదా చేశాం. 7 లక్షల యూనిట్లలో లబ్ధిదారులకు దాదాపు రూ. లక్ష చొప్పున ఆదా అయ్యింది. మా సీఎం పూర్తి పారదర్శక విధానాలను అమలు చేస్తున్నారు. ప్రతి టెండర్‌నూ జ్యుడిషియల్‌ కమిషన్‌ ముందు పెడుతున్నాం. టెండర్ల పరిశీలనకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం..’ అని వివరించారు. ‘రాజధాని విషయంలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎక్కడైనా నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి దాదాపు రూ. 1500 వరకు ఉంటుంది. కానీ అమరావతిలో స్థలం ఉచితం, ఇసుక ఉచితం, అయినా నిర్మాణానికి ఎస్‌ఎఫ్‌టీకి రూ. 11 వేల చొప్పున టెండర్లు ఇచ్చారు. పీపీఏలు రద్దు చేశారని ఆరోపించారు. కేవలం ఎన్నికలకు ముందు చంద్రబాబు యూనిట్‌కు రూ. 4.83 పైసల చొప్పున చేసుకున్న 41 ఒప్పందాలను మాత్రమే రద్దు చేశాం.

ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలు యూనిట్‌కు కేవలం రూ. 3 చొప్పున పీపీఏలు కుదుర్చుకున్నాయి. కొన్ని సందర్భాల్లో రూ. 3 కంటే తక్కువే ఉంది. దీన్నే మేం ప్రశ్నించాం. ప్రస్తుతం ఇది న్యాయ వ్యవస్థ సమీక్షలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోపునరుత్పాదక  విద్యుత్‌ శక్తి విషయంలో సింగపూర్‌ ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యువేబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని గర్వంగా చెబుతున్నాను. రూ. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు అది. అతిత్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మా సీఎం ప్రారంభించబోతున్నారు..’ అని వివరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు