మీటూ ప్రకంపనలు.. కేంద్రమంత్రి రాజీనామా?

14 Oct, 2018 11:58 IST|Sakshi

అక్బర్‌ పదవి ఉంటుందా.. ఊడుతుందా?

సాక్షి, న్యూఢిల్లీ :  #మీటు ఉద్యమం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయమంత్రి , బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం నైజీరియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన.. తనపై వచ్చిన లైంగిక వేధింపులపై ఒక ప్రకటన చేస్తానని మీడియాతో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి తన రాజీనామాను ఈమెయిల్ ద్వారా పంపినట్టు సమాచారం అందుతోంది. అయితే, అక్బర్‌ రాజీనామాను పీఎంవో కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదు. (మీటూ సంచలనం : ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు)

ఎడిటర్‌గా ఉన్న సమయంలో అక్బర్‌ తమను వేధించాడని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్‌ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక #మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్  చేస్తున్న సంగతి తెలిసిందే.

మోదీ నిర్ణయం తీసుకుంటారు..!
అక్బర్‌ను మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను పదవిలో కొనసాగించడం కష్టమేనని అంటున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు ఆరోపణలు వచ్చాయి.  ప్రియ రమణి అనే జర్నలిస్ట్‌ తొలుత అక్బర్‌ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్‌, ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా వ్యహరించారు.

(‘అక్బర్‌’పై స్పందించని కేంద్రం)

మరిన్ని వార్తలు