డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముల పోరు

14 Aug, 2018 01:54 IST|Sakshi

నన్ను కాదంటే పార్టీ పతనమే

కలైజ్ఞర్‌ అభిమానులు నాతోనే ఉన్నారు: అళగిరి

సాక్షి, చెన్నై: పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారనీ, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని  కరుణానిధి పెద్ద కొడుకు, బహిష్కృత పార్టీ నేత అళగిరి సోమవారం వ్యాఖ్యానించారు. పార్టీపై ఆధిపత్యం విషయంలో కరుణానిధి మరో కొడుకు స్టాలిన్, అళగిరిల మధ్య గొడవల నేపథ్యంలో 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాలిన్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకాగా, కరుణ మరణంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టే వీలుంది. 

సోమవారం చెన్నైలో కరుణ సమాధి వద్ద నివాళులర్పించాక అళగిరి మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకేలోకి తిరిగి రాకుండా స్టాలిన్‌ అడ్డుకుంటున్నారన్నారు. ‘కరుణ నిజమైన అభిమానులు, మద్దతుదారులంతా నా పక్షానే ఉన్నారు. సమయమే సమాధానం చెబుతుంది’ అని అన్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉంది. డీఎంకేలోని అనేక మంది నేతలు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తోనూ సంప్రదింపుల్లో ఉన్నారని ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతే ఇక పార్టీ నాశనమైనట్లే. అప్పుడు కరుణానిధి ఆత్మ వారిని శిక్షిస్తుంది. ఊరికే వదిలిపెట్టదు’ అని అన్నారు.  

ఆయన మా పార్టీ మనిషి కాదు
‘అళగిరి మా పార్టీ మనిషి కాదు. ఆయన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని ఎమ్మెల్యే అన్బళగన్‌  అన్నారు. డీఎంకేలో అందరూ ఐక్యంగానే ఉన్నారనీ, స్టాలిన్‌ వెన్నంటే ఉంటామన్నారు. డీఎంకే సీనియర్‌ నేత దురై మురుగన్‌ సైతం ఇదే తరహాలో స్పందించారు.

మరిన్ని వార్తలు