దేశానికి హిందీ రాష్ట్రాలే ముఖ్యం కాదు : స్టాలిన్‌

25 May, 2019 21:38 IST|Sakshi

సాక్షి, చెన్నై : బీజేపీపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. దేశానికి హిందీ రాష్ట్రాలే ముఖ్యం కాదని, దక్షిణాదికి ప్రాదాన్యత ఇవ్వాల్సిందేనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై తిరుగులేని మెజారిటీని సాధించిన స్టాలిన్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హెచ్చరికలాంటి సందేశమిచ్చారు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మోదీ గుర్తించే రోజులు పోయాయని, ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని మోదీ గుర్తించుకోవాలన్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో తమిళనాడులో 38 సీట్లకు గాను 36 సీట్లను డీఎంకే గెలుచుకుంది. అక్కడ బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘నిర్మాణాత్మక రాజకీయాలేమైనా పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు. నిష్పక్షపాతంగా దేశ ప్రదాని అన్ని రాష్ట్రాలను సమన్యాయం చేయాలి. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మీరు గుర్తించే రోజులు పోయాయి.ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని మీరు గుర్తుంచుకోవాలి’’ అని హెచ్చరించారు. శనివారం చెన్నైలో సమావేశమైన డీఎంకే నాయకులు.. పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా టీఆర్‌ బాలు, డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌గా కనిమొళిని పార్టీ నేతలు ఎన్నుకున్నారు.

>
మరిన్ని వార్తలు